
హైదారాబాద్‌ను ఐటీలో మేటి చేసేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు తెలంగాణ సర్కారు విశేష కృషి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరాన్ని అందుకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నది. అవకాశం ఉన్నచోటల్లా లేఅవుట్‌లను సిద్ధం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యేలా చూస్తున్నది. ఇందులో భాగంగానే కోకాపేటలో నియోపోలిస్ లేఅవుట్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే ఇక్కడ భారీ ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ సర్కారు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తున్నది. అత్యద్భుతంగా రహదారిని నిర్మించింది. అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలు నిర్మించుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టింది. ఏడాదిన్నర కిత్రం చేపట్టిన లేఅవుట్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్‌ఎండీఏ కోకాపేట లేఅవుట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులను చేపట్టింది. సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన ఈ లేఅవుట్ ఐటీ కారిడార్‌లోనే అత్యాధునిక మౌలిక వసతుల సమాహారంగా నిలువనున్నది. ఇప్పటికే ఒక విడత ప్లాట్లను విక్రయించిన హెచ్‌ఎండీఏ, మరో విడతలో మిగిలిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
విశాలమైన రోడ్లు.. బాక్స్ డ్రెయిన్.. .
కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌ను ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌ల కంటే భిన్నంగా విశాలమైన రోడ్లతో డిజైన్ చేశారు. 150 అడుగుల నుంచి మొదలు కొని 120,100 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్లను నిర్మిస్తూ, వాటి చుట్టూ కేబుల్స్ కోసం ప్రత్యేక తవ్వకాలు చేపట్టకుండా బాక్స్ డ్రెయిన్ ద్వారా ఎలాంటి కేబుల్స్ అయినా తీసుకువెళ్లేలా లేఅవుట్‌లో నిర్మాణం చేపట్టారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా స్థలాన్ని అందుబాటులో ఉంచారు. సుమారు 5 ఎకరాల స్థలంలో సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే లేఅవుట్‌లో మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్, ప్రిస్టేజ్, రాజ్‌పుష్ప వంటి భారీ నిర్మాణ రంగ సంస్థలు తమ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాయి. అలాగే ప్రభుత్వం కుల సంఘాలకు కేటాయించిన స్థలాల్లో ఆత్మ గౌరవ భవనాలు కొన్ని నిర్మాణం పూర్తి చేసుకోగా, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి.
ఓఆర్‌ఆర్, శంకర్‌పల్లి ప్రధాన రహదారులతో అనుసంధానం
హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న నియోపోలీస్ లేఅవుట్‌కు ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు మెహిదీపట్నం-శంకర్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారులు ఉండగా వీటిని కలుపుతూ లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. లేఅవుట్‌లో ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇక లింకు రోడ్లను పూర్తి చేసే పనిలో హెచ్‌ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా వచ్చే వాహనాలు నియోపోలీస్ లేఅవుట్‌లోకి వచ్చేందుకు వీలుగా ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ పనులను ఆగస్టు-సెప్టెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. లింకు రోడ్ల నిర్మాణం మినహా… లేఅవుట్ లోపల రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్‌గా నియోపోలీస్ లేఅవుట్
కోకాపేటలోని 530కి పైగా ఎకరాల్లో హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న నియోపోలీస్ లేఅవుట్‌ను గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్‌గా నిర్మిస్తున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్ వెల్లడించారు.
36,45 మీటర్ల వెడల్పుతో కూడిన విశాలమైన రోడ్లు, భూగర్భ వరదనీటి కాలువ, కేబుల్స్‌కోసం ప్రత్యేకంగా మార్గాలను భూగర్భంలోనే నిర్మిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇందులో నిర్మాణాలు వస్తే అందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా సబ్ స్టేషన్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ లేఅవుట్‌లో వచ్చే ఏడేండ్లలో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు పనిచేసేలా వివిధ జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.
