మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మున్నేరు పరీవాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ. 650 కోట్లు మంజూరు చేయించాను అని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదు.. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు అని అన్నారు.
మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా.. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మహబూబాబాద్ వెళ్లి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు మున్నేరు పరీవాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆరోపించారు.
మున్నేరుకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది.. ఆదివారం ఉదయం నాటికి 33 అడుగులు నీరు వచ్చింది. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది.. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు అని విమర్శించారు.
మేము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పని చేశామో ప్రజలకు తెలుసు.. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది.. నా హాస్పిటల్‌కు చుక్క నీరు రాలేదు.. నా హాస్పిటల్‌కు మున్నేరుకు సంబంధం లేదు అని అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు.. ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ప్రజల ప్రాణాలను ప్రజలే కాపాడుకున్నారు అని అన్నారు
మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ. 650 కోట్లు మంజూరు చేయించాను.. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి.. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా అని దుయ్యబట్టారు.
మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు.. రెవెన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రాను మంత్రుల ఫంక్షన్ హాళ్లు, విల్లాలతో మొదలుపెట్టండి అని సవాల్ విసిరారు.
ప్రజలు తమ ఇళ్లకు వెళ్లి 36 గంటలు అయింది.. మున్నేరుకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపాలి. కాంగ్రెస్ నేతలు మాపై దాడులు చేశారు. దాడి చేసిన వారి పేర్లతో సహా సీపీకి ఫిర్యాదు చేశాము.. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు అని అజయ్ కుమార్ పేర్కొన్నారు.