ఆదివారం జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బస్సు యాత్ర ద్వారా సోమవారం నిజామాబాద్ దిశగా సాగారు. అంతకు ముందు స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న వారిని కేసీఆర్ పరామర్శించారు. రమణయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరువేసుకున్నారు. తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య సంబురపడ్డారు.
తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధను ఈ సందర్భంగా రమణయ్య ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తుచేశారు. సాధించిన రాష్ట్రాన్ని అనతికాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు.
కష్టాలను, నష్టాలను, సుఖాలను, బాధలను, జయాలను, అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్‌కు చిన్ననాటినుండీ అలవాటేనని అదే ఆయన విజయాలకు మూలమని, అదే స్థితప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని,తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉద్భోదించారు.