డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి ఘన నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కేసీఆర్ కొనియాడారు.
దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3, ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేశారు. వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి స్ఫురద్రూపాన్ని తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు.
దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.
అంటరాని వర్గాలుగా తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక గౌరవం ఇనుమడింప చేసే దిశగా, అంబేడ్కర్ స్ఫూర్తితోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందన్నారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళిత బంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే, అంబేద్కర్ మహనీయునికి మనం ఘన నివాళి అర్పించగలమని కేసీఆర్ పేర్కొన్నారు.