mt_logo

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ రానున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధనలో గమ్యాన్ని చేరుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. కేసీఆర్ నగరంలో అడుగుపెడుతున్నసందర్భంగా ఆహ్వానం పలకడానికి టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు మధ్యాహ్నం 2 గంటలకు కాకుండా సాయంత్రం 4 గంటలకు బేగంపేట నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. డిల్లీ నుండి రావాల్సిన విమానం ఆలస్యం కారణంగా ర్యాలీలో స్వల్ప మార్పులు ఉంటాయని టీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడనుండి టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదులతో కలిసి భారీ ర్యాలీ మధ్య గన్ పార్క్ కు చేరుకోనున్నారు. గన్ పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా నగరమంతా గులాబీ రంగు సంతరించుకుంది. మార్గం పొడవునా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, జేఏసీ జెండాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 13 చోట్ల వాహనాలను దారి మళ్లిస్తూ చర్యలు తీసుకున్నారు. ర్యాలీ ముగిసేంతవరకు నాంపల్లి, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, రైల్ నిలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పలు జిల్లాలనుండి వస్తున్న వాహనాలకు పార్కింగ్ పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *