బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉద్యమకారుడు, భువనగిరి కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి మరియు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిట్టా బాలకృష్ణా రెడ్డికి పునరాగమన శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణారెడ్డి దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి చేరుకున్నట్టు ఉన్నదని అన్నారు. ఈ వేదిక మీద అన్ని విభాగాల నేతలు ఉన్నారు. ఇది అరుదైన దృశ్యమన్నారు. ఉద్యమకారులు అందరం కలిసి కష్టపడి తెచ్చిన తెలంగాణను కాపాడుకుందాం అని సూచించారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే మనకు ఇవాళ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.
ఈన గాచి నక్కల పాలు చేయొద్దు
డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారు, నవ్వాలా సావాలా అర్థం కావడం లేదన్నారు. అమరవీరులగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా తెగువ ప్రదర్శించాలన్నారు. మోడీ రేవంత్ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నారు. తెలంగాణలో ఏం తక్కువ జరిగిందని కేసీఆర్ మీద దాడి చేస్తున్నారని అడిగారు. ఈన గాచి నక్కల పాలు చేయొద్దన్నారు. సోనియా దయతలచి తెలంగాణ ఇవ్వలేదు, కేసీఆర్‌కు ఉద్యమకారులు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ తెలంగాణకు ఏ టీం.. అవ్వల్ దర్జా టీం
బీఆర్ఎస్ ఎవ్వరికీ బీ టీం కాదు.. తెలంగాణకు ఏ టీం.. అవ్వల్ దర్జా టీం అని చెప్పారు. రేవంత్ ఆనాడు సోనియాను బలి దేవత అన్నాడు.. ఇపుడు కాళీ దేవత అంటున్నాడు. రేవంత్ ఆనాడు రాహుల్‌ను ముద్ద పప్పు అన్నాడు.. ఈనాడు నిప్పు అంటున్నాడని అన్నారు. రేవంత్ మారినప్పుడల్లా మనం మారాలా? బీసీల జనగణనపై రాహుల్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, తొమ్మిది నెలల క్రితం మేము బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని పేర్కొన్నారు. రాహుల్‌కు ఇప్పుడు బీసీ గణన గుర్తుకొచ్చింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ గణన ఎందుకు చేయలేదని అడిగారు.
ఏం తక్కువ చేశారని దించాలి?
కేసీఆర్‌ను దించాలని కొందరు అంటున్నారు. కేసీఆర్‌ను ఎందుకు దించాలి 13 లక్షల మందికి పెళ్లిళ్లు చేసినందుకు దించాలా? ధాన్యం రికార్డు స్థాయి లో పండించినందుకు కేసీఆర్‌ను దించాలా? తలసరి ఆదాయం పెంచినందుకు కేసీఆర్‌ను దించాలా? కుల వృత్తులను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలకు కేసీఆర్‌ను దించాలా? ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేనందుకు కేసీఆర్‌ను దించాలా? కేసీఆర్ ఏం తక్కువ చేశారని దించాలి అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు.. ఎమర్జెన్సీ రోజులు తెస్తారా? మోడీని బీజేపీ వాళ్ళు దేవుడు అంటున్నారు.. ఇష్టముంటే మోడీ ఫోటో ఇంట్లో పెట్టుకోండని అన్నారు.
మళ్ళీ కేసీఆరే సీఎం
సిలిండర్ ధర పెంచినందుకు మోడీ దేవుడా? అని అడిగారు. కేసీఆర్ రాహుల్‌కు మోడీలకు కొరకరాని కొయ్య, అందుకే కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలని వాళ్లిద్దరూ కుట్ర పన్నారని అన్నారు. తెలంగాణను ఆగం చేయాలనే వారి కుట్రను భగ్నం చేయాలని సూచించారు. వచ్చే 40 రోజులు చాలా కీలకమని, అంతటా చర్చ పెట్టాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు సీఎం అభ్యర్థులు దొరికారు కానీ ఓటర్లు దొరకలేదు, మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారు.. ఎవ్వరూ రంది పెట్టుకోవద్దన్నారు.