mt_logo

బీఆర్ఎస్ వల్లనే పాలేరుకు మోక్షం: పాలేరు సభలో కేసీఆర్

ప్రపంచంలో ఎక్కడా లేని రైతు బంధుకు ఐక్యరాజ్యసమితి  కితాబిచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నేడు పాలేరు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ..  తెలంగాణ ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం జెండా లేపి ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించినమని పేర్కొన్నారు. చాలా మంది అవహేళన చేశారు. అవమాన పరిచారు. ఎక్కడి నుంచి వస్తది తెలంగాణ ఎట్ల వస్తది అన్నారు. సాధ్యం కాదన్నారు. కేసీఆర్ బక్క పల్చనోడు, ఎవడో బొండిగ పిసికి చంపేస్తరు. ఇది అయ్యేదా పొయ్యేదా అని మాట్లాడారు. 14 సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పెనై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని పరిస్థితి సృష్టిస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. 

ఫలితం పాలేరు ప్రజలకు తెలుసు 

కాంగ్రెస్ పార్టీ డోకా చేస్తే కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా ఏదో ఒకటి జరుగాలని ఆమరణ దీక్షకు కూర్చుంటే నన్ను అరెస్టు చేసి తెచ్చి ఖమ్మం జైళ్లో పెట్టిన సంగతి మీకు తెలుసన్నారు. అనేక మోసాలు ,ఇచ్చిన మాట భంగం చేసి  కాంగ్రెస్ పార్టీ డోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వచ్చిన ఫలితమేందో పాలేరు ప్రజలకు తెలుసు అన్నారు. భక్త రామదాసు లిఫ్టు ప్రారంభానికి  వస్తుంటే నేను కూడా వస్తాను సార్ అని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చారు. నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్ 45 ఏండ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలు ఎదుర్కున్నది పాలేరుకు మీరు నీరందిస్తున్నారు. సంతోషంలో నేను పాల్గొంటా అని వచ్చారు.

నిజం నిప్పులాంటిది 

బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేసినాయి. పాలేరు ఖర్మానికి వదిలివేశారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పాలేరు మోక్షం జరిగిందంటేనే బీఆర్ ఎస్ ప్రభుత్వం  వచ్చిన తర్వాతనే భక్తరామదాసు పూర్తికావడంతో నీళ్లు అందుతున్నాయి. హెలీకాప్టర్‌లో అనేక వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ వల్ల పాలేరు నియోజకవర్గంలో ఎండిపోయిన చెరువులు ఎండాకాలంలో కూడా నిండి కనబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందన్న నాలుకలు ,నరం లేని నాలుకలు ఉన్న నాయకులు ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా. నిజం నిజంగనే ఉంటది కదా. నిజం నిప్పులాంటిది కదా? అని అడిగారు. 

రైతాంగం స్థిరీకరణ పట్టుదలతో నిర్ణయం

రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్. రైతు అవస్థలు పట్టుకున్న ప్రభుత్వాలు గతంలో లేవని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం, రైతాంగం కచ్చితంగా స్థిరీకరణ జరుగాలని అనుకున్నాం. రైతు సంక్షేమం జరుగాలని పట్టుదలతో నిర్ణయం తీసుకున్నాం, ఆషామాషీగా రైతుబంధు పెట్టలేదు. నేను రైతుబంధు పెడితే ప్రముఖ పర్యావరణ వేత్త, వ్యవసాయవేత్త స్వామినాథన్ ప్రశంసించారు. శభాష్ చంద్రశేఖర్ బాగా చేశావు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదని ఐక్యరాజ్యసమితి  కితాబిచ్చింది.