mt_logo

పార్టీని వీడి దొంగల్ల కలిసేటోళ్ల గురించి బాధలేదు.. పార్టీయే నాయకులను తయారు చేస్తది: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఈరోజు కూడా ఎర్రవెల్లికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తనను కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీని వీడి దొంగల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కనా? పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు అని స్పష్టం చేశారు.

నాడైనా, నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నది అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.

ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి వున్నయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నదని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీకు మాత్రమే ఉన్నదని కేసీఆర్ వివరించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి వుంది. ప్రజలు అవకాశమిస్తే.. గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధనదిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలను పొందినం.కుల మతాలకతీతంగా పని చేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపినం. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసినం. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది.. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు అని కేసీఆర్ అన్నారు.

అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతికాదు. మనం ఏ హోదాలోవున్న కానీ ప్రజలకోసం పనోచేయాల్సిందే. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తాం. ఆనాడు మనం ఉద్యమంలకు దిగినప్పుడు మనతో ఎవరున్నారు.?నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు.. బాధ పడేదేమీలేదు.. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది అని వివరించారు.

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కే. సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టర్ గా మరోపక్క ఎమ్మెల్యేగా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కేసీఆర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

కాగా.. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, జాజల సురేందర్, హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.