mt_logo

తెలంగాణ రాష్ట్రానికి 2800 కోట్ల పెట్టుబడి

  • రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కేన్స్ టెక్నాలజీ
  • సంస్థ పెట్టుబడితో 2000 ప్రత్యక్ష ఉద్యోగాలు
  • కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ పక్కనే రానున్న మరో ప్రపంచ స్థాయి సెమీ కండక్టర్ తయారీ యూనిట్

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ  సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 2800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సెమీ కండక్టర్ రంగంలో రానున్న ఈ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నేరుగా 2000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా భారత దేశ సెమీ కండక్టర్ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవబోతున్నది. 

ఈరోజు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ కన్నన్ మరియు సవిత రమేష్ (చైర్పర్సన్) ప్రతినిధి బృందం మంత్రి కె. తారక రామారావుతో ప్రగతిభవన్‌లో సమావేశమై సంస్థ పెట్టుబడి నిర్ణయాన్ని తెలియజేశారు. కేన్స్ టెక్నాలజీ  సంస్థ కొంగరకలాన్‌లో ప్రస్తుతం ఫాక్స్ కాన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి పక్కనే తన పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. 

అవసరమైన ఉత్పత్తులు తెలంగాణ నుండే తయారు

30 సంవత్సరాలకు పైగా తయారీ రంగంలో అనుభవం ఉన్న ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన కేన్స్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకం అయిన ఓఎస్‌ఏటీ /ఏటీఎంపీ విభాగంలోకి తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తన తయారీ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఖాతాదారులకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడి నుంచి తయారు చేయబోతున్నది. ఇందుకోసం ఒక ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేయడంతో పాటు, ముంబై ఐఐటీ భాగస్వామ్యంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేయబోతున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెడుతున్న కేన్స్ టెక్నాలజీ

సంస్థను రాష్ట్రానికి స్వాగతించిన మంత్రి కేటీఆర్ సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ రంగానికి కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈరోజు కేన్స్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ తమ లక్ష్యానికి ఎంతగానో ఊతాన్ని ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇక్కడ ఉన్న మౌలిక వసతుల వలన సెమీ కండక్టర్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే 

సెమీ కండక్టర్ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎంత ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని కేన్స్ టెక్నాలజీ సంస్థ సీఎండీ రమేష్ కన్నన్ తెలియజేశారు. సెమీ కండక్టర్ రంగంలో తమ తయారీ కేంద్రంగా తెలంగాణను ఎంచుకున్నామని, ఇక్కడి ప్రభుత్వం ముఖ్యంగా పరిశ్రమ, ఐటీ శాఖ అధికారుల బృందం అద్భుతంగా పనిచేస్తున్నదని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి నిర్ణయం ఇంత వేగంగా జరుగుతుందని ఊహించలేదని, ఈ క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరులోని వేగానికి దక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం తాము ఏర్పాటు చేయబోతున్న తయారీ ప్లాంట్‌లో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం మరియు మిషనరీ అందుబాటులోకి వస్తుందని సంస్థ చైర్పర్సన్ సవిత రమేష్ తెలియజేశారు.