తెలంగాణ రాష్ట్రంలో లౌకికత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. లౌకిక వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. లౌకికత్వాన్ని పరిరక్షించడానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, భవిష్యత్తులోనూ అదే పంథాలో ముందుకెళ్తారని స్పష్టం చేశారు.
కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో అనేక మతకల్లోలాలు జరిగాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితికి విఘాతం కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడు సాల్మాన్ రాజ్ నేతృత్వంలో క్రిస్టియన్ సంఘాల నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న సామాజిక స్వరూపాన్ని, లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే, బీజేపీ ప్రోత్సహిస్తున్న విద్వేశానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ క్రిస్టియన్లకు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీతోనే క్రిస్టియన్లతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.. విజన్‌తో కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలన చేశారని తెలిపారు.
ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో ప్రెయర్ పవర్ ఫౌండర్ శామ్ అబ్రహం, ఎల్బీ నగర్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జేకబ్, మెడికల్ మిషన్ జవహార్ కెన్నిడి, కూకట్‌పల్లి అసోసియేషన్ రేవరెండ్ ఇజ్రెల్, రెవరెండ్ దేవదానం, పాస్టర్ సాపా శ్రీనివాస్, పాస్టర్ అరవింద్, సాల్వేషన్ ఆర్మీ చర్చి మేజర్ ఫిలిప్ రాజ్, లెఫ్టినెంట్ హేమా సునీల్, తదితరులు ఉన్నారు.