mt_logo

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత నిందితురాలు కాదు బాధితురాలు: బీఆర్ఎస్ ఎంపీలు

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈడీ దాడులపై స్పందిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలలో భాగంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చూస్తున్న కుట్రలు ఇవి. కవితమ్మ అరెస్ట్ కూడా దురదృష్టకరం.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.

శివసేన పార్టీపై గతంలో బీజేపీ కుట్రలు కూడా చూశారు. ఒక్క పాలసీ అనేది ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్చుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చారు అని నాగేశ్వర రావు గుర్తు చేశారు.

మహిళ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా జరుగుతున్న పరిణామాలు చూసి రానున్న రోజుల్లో మా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్న అని తెలిపారు.

10 ఏండ్ల పాటు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.. నేను రైతు బిడ్డనే.. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు..రాష్ట్రంలో ప్రజలు అంత బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్న.. రానున్న రోజుల్లో న్యాయం జరుగుతుంది మాకు సంపూర్ణ నమ్మకం ఉంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ రైడ్స్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చేశారు. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా బీజేపీకి పార్టీకి లొంగని వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు అని అన్నారు.

మోడీ ఒక శక్తి అని రాద్దాంతం చేస్తున్నారు.. అదే మోడీ అడబిడ్డను చీకటి పడ్డాక అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా అధిగమించి తెలంగాణ రాష్ట్రం సాధించారు అని సురేష్ రెడ్డి గుర్తు చేశారు.

అవినీతి జరిగింది అంటే ఆరోపణలు రుజువు చేయాలి. న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రెండేళ్లు సీరియల్ లాగా సాగదీసిన ఈ కేస్‌ను ఇప్పుడు ఎన్నికల వేళ తెరపైకి తెచ్చారు. 2004 నుండి 2014 వరకు 200 ఈడీ కేస్‌లు ఉంటే కేవలం 2014 నుండి పది సంవత్సరాలు 2954 పై చిలుకు కేస్‌లు పెరిగాయి అని తెలిపారు.

ఈ కేస్‌లో కవిత ఎప్పుడు బాధితురాలు కానీ నిందితురాలు కాదు. ఎన్నికల టైంలో ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది.. మద్యం పాలసీ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది అని అన్నారు.

బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారు. కోర్టులపై నమ్మకం ఉంది.. కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని రవిచంద్ర అభిప్రాయపడ్డారు.

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను మూల్యం చెల్లించక తప్పదు. ఈడీ, ఐటీ, సీబీఐలను రిమోట్ కంట్రోల్ లాగా కేంద్ర ప్రభుత్వం వాడి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నాయి అని అన్నారు