స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో గంగపుత్ర సంఘం నేతలు కలిశారు. ఇటీవల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేటెడ్ కమీషన్‌కు కులగణనపై నివేదిక ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీ మహిళలకు కోటా కల్పించాలని కూడా పోరాటం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమాలకు కూడా తాము మద్ధతిస్తున్నామని అన్నారు.
ఏ అంశాన్ని తీసుకున్న ఇప్పటి వరకు తాము వెనుకడుగు వేయకుండా పోరాటం చేశామని చెప్పారు. గతంలో తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటం చేసిందని గుర్తుచేశారు