mt_logo

రేవంత్ రెడ్డి ఓ సైకో సీఎంలా తయారయ్యాడు: కౌశిక్ రెడ్డి

రేవంత్ జేబులు నింపుకునేందుకే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వీపు చింతపండు కాదు పుచ్చపండు అవుతుందని.. రేవంత్ రెడ్డి ఓ సైకో సీఎంలా తయారయ్యాడు అని దుయ్యబట్టారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ మీద సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరు బీఆర్ఎస్‌లో లేరు అని పేర్కొన్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది. కేసీఆర్ హయాంలో మూసీ సుందరీకరణను 16 వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. రూ. 3,800 కోట్ల రూపాయలతో స్పెషల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, అందమైన బ్రిడ్జీలు కేసీఆర్ హయాంలోనే కట్టారు అని తెలిపారు.

హరీష్ రావు, కేటీఆర్‌ల వీపు చింతపండు అవుతుంది అంటున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇండ్లు కూలగొడుతున్న ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా రావాలి, ఎవరి వీపు చింతపండు అవుతుందో చూద్దాం. రేవంత్ రెడ్డి వీపు చింతపండు కాదు పుచ్చపండు అవుతుంది అని అన్నారు.

రేవంత్ శాడిస్ట్‌లా మారి పేదల ఇళ్ళ మీద పడ్డాడు. రివర్‌బెడ్ ఆర్‌బీ అని పేదల ఇండ్ల మీద అని రాస్తున్నారు.. అది ఆర్‌బీ కాదు.. రేవంత్ బుల్డోజర్. హుజురాబాద్‌లో కూడా పేదల ఇండ్లకు రెడ్ మార్క్ చేస్తున్నారు. నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూల్చినా హుజురాబాద్ అగ్ని గుండం అవుతుంది అని హెచ్చరించారు.

అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. తప్పు చేసే అధికారులను విడిచిపెట్టం. చెరువుల ఆక్రమణలు అంటూ ఇళ్ళు కూల్చివేయడం హైకోర్టు గత ఆదేశాలకు విరుద్ధం అని అన్నారు.

రేవంత్ జేబులు నింపుకునేందుకే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. బుల్డోజర్ రాజ్ అని మాట్లాడే రాహుల్ ఇక్కడ జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడరేం? అని కౌశిక్ రెడ్డి అడిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. కాళేశ్వరంతో 38 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది. లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్ట్‌తో అవినీతి తప్ప ఏం లాభం లేదు అని ఎద్దేవా చేశారు.