mt_logo

రుణమాఫీపై దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా: హరీష్ రావు

దసరా తరవాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తం.. రుణమాఫీ అమలు చేయిస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నడు.. డిసెంబర్ 9 అన్నడు.. ఆగష్టు 15 అన్నడు. కొమురెల్లి మల్లన్న, యాదాద్రి, భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టి మొనగాడు లెక్క మాట్లాడిండు. మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయింది అని దుయ్యబట్టారు.

రైతుబంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు.. ఇప్పుడు సప్పుడు లేదు. మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చెయ్యి హరీష్ రావు అని సవాల్ విసిరిండు. రుణమాఫీ అయితే ఎందుకు ఇంత మంది వచ్చారు. పాలకుర్తి మండలంలోనే 4,314 మందికి రుణమాఫీ కాలేదు అని అన్నారు.

తుమ్మల గారే చెప్పారు 22 లక్షల మందికి చేశా.. మిగతా వారికి కాలేదు అన్నడు.. చెప్పిన 22 లక్షల మందిలో కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు అంటే, పెళ్లి కాలేదు అంటున్నారట. కొందరికి ఆధార్ కార్డు లేక ఆపుతున్నారు. ఇదేమి రాజ్యం.. 31 సాకులు పెట్టి ఎగవెట్టే ప్రయత్నం చేసిండు అని విమర్శించారు.

రేవంత్ మోసగాడు అని రైతులు, ప్రజలు అంటున్నారు. కర్ణాటక 5, తెలంగాణ 6 గ్యారెంటీలు పెట్టారు.. హర్యానాలో 7 గ్యారెంటీలు అన్నారు. వరంగల్ వచ్చి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నడు.. కాలేదు. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు అన్నడు కాలేదు. రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నడు.. కాలేదు. పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తా అన్నడు.. కాలేదు. అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అని, ఇప్పుడు సన్నాలకి మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు.. కాలేదు. ఏమైంది అందులో చెప్పినవి.. రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా పోతుంది అని ఎద్దేవా చేశారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తున్నది. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారు. మూసీని ఆనుకొని ఉన్న పేదల ఇళ్లు కూల గొడితే ఊరుకోం అని హెచ్చరించారు.

ఇంకెప్పుడు ఇస్తారు రైతుబంధు.. కమిటీ వేసిండు, అసెంబ్లీలో మాట్లాడతా అన్నడు, దసరాకి ఇస్తామని ఇంకో మంత్రి అంటాడు. దసరా పండుగలోపు రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతులందరికి రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టం.. చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క బస్సు తప్ప ఆరు గ్యారెంటీలు తుస్సే. ప్రభుత్వం మాటలు నమ్మి రూ. 2 లక్షల పైన అప్పు కడితే రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు చేస్తావ్. నీకు చెవులు, కళ్ళు ఉంటే చెయ్యి అని మండిపడ్డారు.

రైతుల మీద మిత్తి పడుతున్నది. నువ్వు మాఫీ చెయ్యకుంటే పరిస్థితి ఏం కావాలె..రెండు లక్షల రుణమాఫీ కాలేదని మహబూబ్‌బాద్‌లో రవి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా. రైతుల కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు అని విచారం వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి రైతులకు మాత్రం రైతుబంధు ఆపలేదు కేసీఆర్. రైతు గుండె కేసీఆర్‌ది. అందుకే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేసిండు. అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలు పక్కకు పోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడు. ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతిపక్షంగా వెంటపడి అడుగుతాం. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నడు.. పది నెలల్లో ఎన్ని ఇచ్చినవ్. కేసీఆర్ పరీక్షలు పెట్టిన 30,000 ఉద్యోగాలు తప్ప నువ్వు ఇచ్చిందేమీ లేదు. మిగిలిన రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతావా అని అడిగారు.

తల్లులను, తండ్రులను, విద్యార్థులను మోసం చేసిండు. డీఏలు ఇవ్వక ఉద్యోగులను మోసం చేసిండు. అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు అని ఆరోపించారు.

రైతులెవరు ఆధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి మెడల వంచి మీకు రుణమాఫీ అమలు చేయిస్తాం. దసరా తరవాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తం.. రుణమాఫీ అమలు చేయిస్తాం. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు వచ్చే ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీయాలని రాష్ట్రవ్యాప్త రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరుపున పిలుపునిస్తున్నాం అని అన్నారు.

కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టి, తిట్ల మీద పడ్డడు. సమాధానం చెప్పలేక తిట్లు తిడుతున్నావ్.. ఎక్కువ కాలం గుండాగిరి నిలబడదు. అది కొడతా, ఇది కొడతా అంటున్నావ్.. అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కొట్టు.. దగ్గర ఉండి సహకారం అందిస్తాం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మాది ప్రజల పక్షం అని స్పష్టం చేశారు.

పాలకుర్తి ఆసుపత్రి పనులు ఎందుకు కావడం లేదు.. బతుకమ్మ చీరలు లేదా నువ్వు ఇస్తానన్న 500 రూపాయలు మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. వరదల వల్ల పంట నష్టం పోయిన రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కోతలకు తొండలు కారణం అవుతున్నయట. 24 గంటలు కాదు 10, 12 గంటలు కూడా ఇవ్వడం లేదు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో నా మీద 300 కేసులు పెట్టారు.. ఇప్పుడు 30 పెట్టారు.. ఎన్ని కేసులు పెట్టినా నిన్ను వదిలిపెట్టేలేదు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలో చెప్పాలి.. బై ఎలక్షన్ వస్తది.. రాజయ్యను గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.