mt_logo

తెలంగాణే గెలువాలె..

By: కట్టాశేఖర్ రెడ్డి:

తెలంగాణ కిందపడితే నవ్వాలనుకుని నవ్వలేకపోయినవారు, ఓడిపోతే సంబరాలు చేసుకోవాలని చేసుకోలేకపోయినవారు, అల్లకల్లోలమైతే ఆనందతాండవం చేయాలని కలలుగని ఆశోపహతులైనవారు ఇప్పుడు మరోసారి తమ జుట్లు విదిలించుకుని తెలంగాణపై ఎగబడతున్నారు. ఏదో తెలియని దుఃఖం వారిని వెంటాడుతున్నది. కేసీఆర్‌ను ఎలాగైనా కదిలించాలని, చలించేలా చేయాలని ఊగిపోతున్నారు. చేతికి దొరికిన గడ్డీగాదం, బురదాబూచీ అన్ని ఆయనపై విసురుతున్నారు. విచిత్రం ఏమంటే శాస్త్రం చెప్పిన బల్లులు కుడితిలో పడినట్టు జీవితాంతం తెలంగాణ మంత్రం చదివినవాళ్లు సైతం ఇప్పుడు కేసీఆర్‌ను, తద్వారా ఆయన నిలబెట్టిన తెలంగాణవాదాన్ని ఓడించాలని రాగాలు తీయడం!

తెలంగాణ వాళ్లకు పరిపాలించడం చేతకాదు. కుమ్ములాడుకుంటారు. రాజకీయ అస్థిరత్వం వస్తుంది. చిన్న రాష్ట్రం కుదురుగా నిలబడలేదు. తెలంగాణ వస్తే మావోయిస్టుల రాజ్యం వస్తుంది. తెలంగాణ వస్తే కరెంటుండదు. అంధకారం అయిపోతుంది.. అని తిట్టిపోసినవాళ్లు తెలంగాణకు ఇప్పుడు కొత్త సర్టిఫికెట్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు నియంతృత్వం నడుస్తున్నది. ప్రభుత్వం ఒక్క మాటగా సాగుతున్నది. తెలంగాణ కోసం పనిచేసినవారికి గుర్తింపు లేదు. తెలంగాణ వస్తే ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందన్నారుగా ఏదీ ఎక్కడ? మావోయిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నది. అవినీతి కట్టలు తెంచుకుంటున్నది.. ఇలా ఎవరికి తోసిన తిట్టు వారు తిట్టిపోస్తున్నారు. నరంలేని నాలుకలు కదా ఎటైనా తిప్పేయవచ్చు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఈ శనిపక్షులు పెట్టిన శాపనార్థాలు ఒక్కటి కూడా వాస్తవం కాదని కేసీఆర్ రుజువు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత అదే శనిపక్షులు వేస్తున్న నిందలు కూడా నిజం కాదని వరంగల్ లోక్‌సభ స్థానానికి పసునూరి దయాకర్ ను ఎంపిక చేయడం ద్వారా మరోసారి రుజువు చేశారు కేసీఆర్. బలమైన ప్రభుత్వం కోసం, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు బయటి పార్టీల నాయకులను తీసుకువచ్చినా, కేసీఆర్ తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేసిన వారెవరినీ నిర్లక్ష్యం చేయడం లేదని దయాకర్ ఎంపిక స్పష్టం చేసింది. నిజానికి గుడిమళ్ల రవికుమార్ కూడా తెలంగాణ ఉద్యమంలో కష్టపడినవారే. పార్టీ నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా సీరియస్‌గానే పరిశీలించింది. కానీ కొన్ని వివాదాలను నివారించడంకోసం తుదకు దయాకర్‌ను ఎంపిక చేశారు. దయాకర్ మొదటి నుంచి మొక్కవోని తెలంగాణవాదిగా నిలబడినవారు. ఫైన్ ఆర్ట్స్ చదివిన దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడంలో క్రియాశీల పాత్రపోషించారు. మాదిగ ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్న నాయకుడు. ఆయన ఎప్పుడూ గోడమీది పిల్లిలా కూర్చుని ఏ పడవలో దూకుదామా అని ప్రయత్నాలు చేయలేదు.

అవసరాలు, అవకాశాల ప్రాతిపదికగా జెండాలను, ఎజెండాలను మార్చలేదు. అటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల ఇవ్వాళ తెలంగాణవాదుల్లో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. కల్మషం, కళంకం లేని అచ్చ తెలంగాణవాదిని అభ్యర్థిగా పెట్టి గెలిపించాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే తెలంగాణ కిందపడితే నవ్వాలనుకుని నవ్వలేకపోయినవారు, ఓడిపోతే సంబరాలు చేసుకోవాలని చేసుకోలేకపోయినవారు, అల్లకల్లోలమైతే ఆనందతాండవం చేయాలని కలలుగని ఆశోపహతులైనవారు ఇప్పుడు మరోసారి తమ జుట్లు విదిలించుకుని తెలంగాణపై ఎగబడతున్నారు. ఏదో తెలియని దుఃఖం వారిని వెంటాడుతున్నది.

కేసీఆర్‌ను ఎలాగైనా కదిలించాలని, చలించేలా చేయాలని ఊగిపోతున్నారు. చేతికి దొరికిన గడ్డీగాదం, బురదాబూచీ అన్ని ఆయనపై విసురుతున్నారు. విచిత్రం ఏమంటే శాస్త్రం చెప్పిన బల్లులు కుడితిలో పడినట్టు జీవితాంతం తెలంగాణ మంత్రం చదివినవాళ్లు సైతం ఇప్పుడు కేసీఆర్‌ను, తద్వారా ఆయన నిలబెట్టిన తెలంగాణవాదాన్ని ఓడించాలని రాగాలు తీయడం.

నిజమే తెలంగాణ మళ్లీ ఒక పరీక్షను ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేడు మాసాలు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడటంపైన, ప్రభుత్వం పనితీరుపైన సమీక్షలు, విశ్లేషణలు చేసుకోవలసిన తరుణంలో వరంగల్ లోక్‌సభ ఎన్నిక వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఏమి చేయాలి? ఏమి చూసి ఓట్లేయాలి? తెలంగాణ వచ్చి మాకేమిచ్చింది? ఈ ప్రశ్నలకు ఆంధ్ర ఆధిపత్య భావజాలంలో కలుషితమైన మేధావులకంటే పల్లెజనం బాగా సమాధానం చెప్పగలుగుతున్నారు. మొన్న నల్లగొండ నుంచి ఒక పెద్ద రైతు ఫోను చేశారు. ఆయన సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిఏటా ఉద్యమాలు చేసేవారు. ఆయన ఫోను చేసి బాబూ! కేసీఆర్‌ గారికి ధన్యవాదాలు చెప్పండి. మేము తెలంగాణను చూస్తున్నం. అనుభవిస్తున్నం. ఇంత కరువుకాలంలో, డెడ్‌స్టోరేజీ నుంచి నీళ్లు తెచ్చి మా పొలాలకు అందిస్తున్నరంటే అది తెలంగాణ వల్లనే సాధ్యమైంది. తెలంగాణ జిద్దు ఉండేవాళ్లు గవర్నమెంటులో ఉన్నరు కాబట్టే సాధ్యమైంది. నాకు ఈసారి ఆశలు లేకుండె నీళ్లొస్తయని. చాలా సంతోషంగా ఉంది అని ఆయన చెప్పుకుపోయారు. ఇటీవల ఒక సాహితీ సభకు వెళ్లాను. అక్కడ ఒక కవి చెప్పాడు- తెలంగాణ వచ్చి మాకేమిచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నరు. మాకేమొచ్చిందని కొందరు మాట్లాడుతున్నరు. ఎవరికి ఏదైనా వచ్చిందో లేదో, కనిపిస్తున్నదో లేదో కానీ నాకు మాత్రం నా తెలంగాణ అనుభవం అడుగడుగునా కనిపిస్తున్నది. ఇవ్వాళ సెక్రటేరియట్‌కు పోతే అన్నా అని పిలిస్తే పలికే మంత్రులు ఉన్నారు. ఉద్యోగ నాయకులు ఉన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కావాలని ఇలా అడిగితే అలా చేసి పెట్టిండ్రు. మా ఊరికి వాటర్ షెడ్ కావాలని అడిగిన. మా వాగుకు అడ్డుకట్ట వేసి ఊరికి నీరు మళ్లించుకోవాలన్నది నా కల. ఆరు వారాల్లో మంజూరు చేసిండ్రు. ఇవ్వాళ తెలంగాణలో ఎక్కడ చూసినా మన సంస్కృతీ సంప్రదాయాల ఆటపాట వినిపిస్తున్నది. ఇంతకంటే ఏమి కావాలె అని ఆయన వివరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు పూర్తి కాకుండానే ఒక్క గంట కరెంటు కోత లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ చరిత్రలో మరొకటి ఏదైనా ఉందా? అని వరంగల్ జిల్లాలో రైతు దామోదర్‌రెడ్డి ప్రశ్నించాడు. ఖర్మగాలి ఈసారి కాలం కాలేదు. నీళ్లు లేవు. రైతులు ఆగమయిండ్రు. కరెంటు ఉన్నా ఏమీ చేసుకోలేని పరిస్థితి అని ఆయన చెప్పాడు.

ఎప్పుడూ చూడలేదు… జూరాల కింద చెరువులన్నీ నింపారు. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద చెరువులు నింపారు. ఇప్పుడు సాగర్ కాలువల ద్వారా చెరువులకు, పొట్టకొచ్చిన పొలాలకు నీరు తరలించారు. తెలంగాణ వల్ల ఏమి ఒరిగిందో నిజాయితీ లేని మేధావులకంటే కష్టజీవులైన ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణకు ఇప్పుడు సమస్యలే లేవని కాదు. రైతు ఆత్మహత్యలు ఇప్పుడే పుట్టుకొచ్చినవి కాదు, ఇప్పుడిప్పుడే ఆగిపోతాయనీ చెప్పలేం. వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఆధిపత్య శక్తుల నుంచి వారసత్వంగా ఈ సంక్షోభం కొనసాగుతున్నది. దీనిని అధిగమించడానికి సమయం పడుతుంది. ఆరు దశాబ్దాలపాటు తెలంగాణను ఎండబెట్టిన పాపం వెంటాడుతున్నది. తెలంగాణ రైతులు ఇప్పుడు ఈ సంక్షోభంలో కొనసాగుతున్నారు.

ఈ సంక్షోభాన్ని మనకు అప్పుగా ఇచ్చిపోయినవారి తరఫున వకాల్తా పుచ్చుకుని ఇక్కడి మేధావులు, ఇక్కడి మెతుకుతిని బతుకుతున్న మీడియా మాట్లాడటం ఇంకా ఆశ్చర్యకరం. ఆరు దశాబ్దాలపాటు విఫలమైనవారిని వదిలేసి పదిహేడుమాసాల పసికందుపై కత్తులు దూయడం. తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీని, నాయకుడిని బద్నాం చేయాలని చూడటం. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులకూ ఇప్పటికీ ఏమీ తేడా కనిపించడం లేదు. ఆ రోజుల్లో కూడా ఆంధ్ర ఆధిపత్యశక్తులు అస్తమానం కేసీఆర్‌పైనే దాడి చేస్తూ వచ్చాయి. పొద్దున లేస్తే ఏవో కారుకూతలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని కొట్టాలంటే కేసీఆర్‌ను కొట్టాలి. కేసీఆర్‌ను బలహీనపరిస్తే తెలంగాణను బలహీనపరిచినట్టే. అందుకే అప్పుడు ఆయనపై దాడి చేసేవారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం.

కేసీఆర్‌ను బద్నాం చేయాలి. బలహీనపర్చాలి. పలుచన చేయాలి. లొంగదీసుకోవాలి. అప్పుడు ఉద్యమాన్ని దెబ్బకొట్టాలన్నది లక్ష్యం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలన్నది, అస్థిరత్వంపాలు చేయాలన్నది తాపత్రయం. అప్పుడయినా ఇప్పుడయినా తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని జీర్ణించుకోలేని శక్తులే ఎడబొబ్బలు, పెడబొబ్బలు పెడుతున్నాయి. మొన్నామధ్య ఒక తెలంగాణ వ్యాసాల పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యాను. ఆ పుస్తకాన్ని ప్రచురించినాయన అతిథులందరినీ వేదికపైకి పిలిచి, ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన మూడు వ్యాఖ్యలు చేశారు. మొదటిది, ప్రజలతో సంబంధం లేని రాజకీయ వికృతి పర్యవసానమట రాష్ట్ర విభజన. రెండవది, రెండు రాష్ట్రాల్లోనూ నిశ్శబ్దం రాజ్యం చేస్తున్నదట. మూడవది, ఆ పుస్తకం పరాజితుల చరిత్ర అట. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రచురణ కర్త.

ఎంత అజీర్తి ఆయనలో ఉందో ఈ మూడు మాటలతో తేలిపోయింది. ఇటువంటి అభిప్రాయం ఆంధ్ర మేధావులకే కాదు, చాలా మంది ఇక్కడి మేధావులకు కూడా ఉంది. ఈ వ్యాఖ్యలు విన్న నాకు ఆశ్చర్యం వేసింది. మూడు అభిప్రాయాలూ అబద్ధాలే. తెలంగాణ ఉద్యమం రాజకీయ ప్రకృతి, ప్రజల అభీష్టం కలిసి సాగిన ఉద్యమం. ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఉద్యమం. వికృతి ఏదైనా ఉందంటే తెలంగాణను అడ్డుకోవడానికి సాగిన ఉద్యమం. ఇక పుస్తక రచయిత తెలంగాణవాది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నవారిలో ఒకరు. ఆయన రాసింది విజేతల చరిత్రే కాని పరాజితుల చరిత్ర కాదు.

అది పరాజితుల చరిత్ర అంటే రచయితను అవమానించడం. చివరగా నిశ్శబ్దం గురించి…. ఎక్కడ నిశ్శబ్దం ఉంది? ఎవరు ఏడుస్తున్నారు? ఎందుకింత దుఃఖం కలుగుతున్నది వీరికి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఆంధ్రలో 11 జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. భూముల ధరలు పది ఇరవై రెట్లు పెరిగాయి. వారి హక్కుల సాధనకోసం వారు కేంద్రంతో కొట్లాడుతున్నారు. తెలంగాణ తన సొంత అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుంటున్నది. సంక్షేమ బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచింది. వృద్ధులు, వికలాంగులు, బీడీకార్మికులు, వితంతువులు… లక్షలాది మందికి పింఛన్లు ఇచ్చి సామాజిక భద్రత కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పింఛను వల్ల మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నార్రా అని ఒక తాత చెబితే ఎంత సంతోషం వేసిందో.

విద్యుత్ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు ఏకకాలంలో వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలమన్న నమ్మకం కలుగుతున్నది. చిన్న చిన్న చిక్కుముడులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. అయినా కొందరు ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నారంటే వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వారికి ప్రజలకు ఏం జరుగుతున్నదన్నదానితో పనిలేదు. మాకు ఏమి జరుగుతున్నదన్నదే ముఖ్యం. వాళ్ల ఫిర్యాదులన్నీ వ్యక్తిగతమైనవి. మాతో మాట్లాడటం లేదు. మాతో చర్చించడం లేదు. మాకు మర్యాద ఇవ్వడం లేదు. మాకు సలాములు చేయడం లేదు అని వారు కుమిలిపోతున్నారు. ఫేస్‌బుక్‌లో ఒక మిత్రుడు ప్రశ్నించాడు. మీతో రోజుకోసారి మాట్లాడి, మీతో కలిసి భోంచేసి, మీతో చర్చలు జరిపి, ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్వాలేదా? కేసీఆర్ చేయనిది, చంద్రబాబు చేస్తున్నది అదేనా?

చంద్రబాబును ఆకాశానికెత్తుతూ కేసీఆర్‌ను దుమ్మెత్తిపోస్తూ పత్రిక నింపడానికి కారణం ఇదేనా? పచ్చని పంటపొలాలను తగులబెట్టిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఓడిపోవాలని రాసే ధైర్యం మీకుందా? అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ ఆధిపత్యం అన్నదే శాసిస్తున్నది. కానీ ప్రజలకు తెలుసు. ఎవరు తన, ఎవరు మన అన్న విచక్షణ మేధావులకు, ఆధిపత్యశక్తులకు అర్థంకాకపోవచ్చు. కానీ తెలంగాణ ఫలాలను ఆస్వాదిస్తున్న సమాజానికి వీరిని ఏమి చేయాలో, ఎక్కడ వాత పెట్టాలో బాగా తెలుసు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *