mt_logo

ఏం చూసి కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేయాలి?- హరీష్ రావు

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హన్మకొండ కుడా మైదానంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ఆకాంక్షను తెలియచెప్పాం.. కానీ ఈ ఉప ఎన్నిక అభివృద్ధి సాధకులకు, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరుగుతున్నది. ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ భయపడుతున్నది. అందుకే వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి తప్పుకుందని ఎద్దేవా చేశారు. పార్టీలో మొన్నటిదాకా సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చిన దీన స్థితి బీజేపీదని, బీజేపీ అభ్యర్థి దేవయ్య కోట్లు సంపాదించాడేమో కానీ, వరంగల్ ప్రజల ఓట్లు సంపాదించలేడని హరీష్ రావు స్పష్టం చేశారు.

వరంగల్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశాం.. హెల్త్ యూనివర్సిటీని కేటాయించాం. సీఎం కేసీఆర్ వరంగల్ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారని హరీష్ అన్నారు. తెలంగాణ తల్లి రూప శిల్పి పసునూరి దయాకర్ 14 ఏళ్ళపాటు పార్టీని వెన్నంటి ఉండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అని, తెలంగాణ ఏర్పాటు కోసం జైలుకు కూడా వెళ్ళాడని గుర్తు చేశారు. ఇటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తిని అభివృద్ధి కాముకులైన వరంగల్ ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *