mt_logo

బొంక నేర్చిన మేళం..

By: కట్టా శేఖర్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల సమయం సమీపించే కొద్దీ మళ్లీ ఒక కుటిల ప్రచారయుద్ధాన్ని నడిపించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాండుమేళం సిద్ధమవుతున్నది. అందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వేల పేరిట సకల అబద్ధాలను కుమ్మరించి బొక్కబోర్లా పడ్డ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతాడని, సర్వేలు తలకిందులైనందుకు క్షమాపణలు కోరుతారని ఆశించినవారికి ఆయన అసలు స్వభావమేమిటో అర్థమైంది. రెండురోజుల క్రితం ఒక పత్రికాధిపతితో చంద్రబాబును కలిసి దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిపిన పిమ్మట ఢిల్లీ వెళ్లి చిన్నగా తనపై పడిన దొంగ సర్వేల మకిలిని కడిగేసుకుని, ఇంకా తనేదో గొప్ప సర్వేయర్ను అని చెప్పుకునేందుకు, చరిత్రలో తనసర్వేలు ఎప్పుడూ తప్పుకాలేదని బొంకేందుకు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏవేవో అనుమానాలను రేకెత్తించేందుకు చాలా సెకలు పడ్డారు. పోలైన ఓట్ల జాబితా సకాలంలో అందలేదని, అందులో ఏదో పెద్ద మతలబు ఉందని చెప్పడానికి ప్రయత్నించాడు. నిజానికి రాజగోపాల్ ఎంత అజ్ఞానో ఈ ఒక్క మాటతోనే తేలిపోయింది. పోలైన ఓట్ల వివరాలు ప్రాథమికంగా ఒకసారి, తుది వివరాలు మరోసారి ఇవ్వడం అన్నది ప్రతి ఎన్నికలోనూ జరుగుతూ వచ్చిందే. ప్రాథమికంగా చెప్పిన శాతాలకు, తుది శాతాలకు తేడా ఉండటం అన్నది ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అందరికీ తెలిసిన విషయమే. పూర్వం జరిగిన ఎన్నికలనాటి పత్రికలను తిరిగేస్తే ఈ వాస్తవం తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలనాటికి ఇప్పుడు స్థానిక ఎన్నికలనాటికి పరిస్థితిలో తేడా వచ్చిందని, ప్రతిపక్షాలకు బాగా సర్పంచులు వచ్చాయని, అదేదో తన సర్వేకు అనుకూలంగా ఉన్నాయన్న భావన కలిగించేందుకు మరో పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ప్రకటించాడు.

పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మునుపెన్నడూలేని రీతిలో 67.7 శాతం గ్రామాలను కైవసం చేసుకున్నది. మొత్తం ఎన్నికలు జరిగిన 12,711 పంచాయతీల్లో 8,606 పంచాయతీలను గెల్చుకున్నది. అయితే రాజగోపాల్‌కు ఈ విషయాలు తెలియక కాదు. తెలిసీ బొంకడం బరితెగించినవాళ్ల లక్షణం. తాను ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి ఇప్పుడు సాకులు వెతుకుతున్నాడు. తానేదో కరెక్టుగా సర్వే చేశానని ఎక్కడో ఏదో జరిగిందని, ఎన్నికల తర్వాత ఆ విషయాలు మాట్లాడుతానని చెప్పి, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఒక కొత్త ఎంట్రీని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఆడిన నాటకాన్నే ఆంధ్రలో ఆడటానికి బాబుతో కలిసి రంగం సిద్ధం చేస్తున్నాడని ఆ అర్ధరాత్రి మీటింగు, ఆ మరుసటిరోజే ఢిల్లీలో మీడియాతో మాటలు తెలియజేస్తున్నాయి. చంద్రబాబుకే కాదు, ఆయన బ్యాండు మేళానికంతటికీ తెలంగాణ ఎన్నికలు ఒక ఆటస్థలం. ఆంధ్ర ఎన్నికలు జీవన్మరణ సమస్య. అందుకే తెలంగాణలో చేసిన తప్పుడు ప్రచారాలకు వంద రెట్లు ప్రచారాలు అక్కడ చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. దానికి ఇప్పటినుంచే సన్నాహాలు. సర్వే తప్పయితే ఒప్పుకుంటా.. నాకు సిగ్గు లేదు అని యథాలాపంగా రాజగోపాల్ అన్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజగోపాల్‌కు, చంద్రబాబు బృందానికి సిగ్గూ ఎగ్గూ లేదని రాజకీయాల్లో వారి అష్టవంకరలు, విపరీత పోడకలు చాలాసార్లు రుజువుచేశాయి. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా, భ్రమను బ్రహ్మరాక్షసిగా, బ్రహ్మరాక్షసిని ఉత్త భ్రమగా, భయంకర వ్యవస్థాగత అవినీతిని, మహోద్ధారక కార్యంగా, ఉద్ధారక కార్యాలను అవినీతి చర్యలుగా, వెన్నుపోటును ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటుగా చిత్రించగల చిత్రాంగులు వీరు. వీరిగురించి ఇలా ఎన్ని అలంకారాల్లోనైనా వర్ణించవచ్చు. చంద్రబాబునాయుడు కానీ, ఆయనను మోసిన మీడియా కానీ, ఇతర వ్యవస్థలు కానీ ఏరోజూ తాము చేసిన తప్పులకు విచారం ప్రకటించిన సందర్భం లేదు.

ఎన్టీఆర్‌ను అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి చంపినవారు కనీసం తాము చేసింది తప్పని ఇంతవరకు అధికారికంగా ప్రకటించుకున్నది లేదు. బుకాయింపులతో, ప్రచారాలతో, వక్రీకరణలతో, అబద్ధాలతో బతికేయడం ఆ బృందానికి అలవాటైంది. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్రచేసిన రోజున తండ్రిని కాదని బావకు మద్దతుగా వెళ్లిన ఆయన తనయులు ఒక్కసారి కూడా నాన్నా మళ్లీ ఎప్పుడు పుడతావు అని తప్ప నాన్నా మమ్మల్ని క్షమించు అని ప్రకటన ఇవ్వలేదు. మళ్లీ ఎప్పుడు పుడతావు అన్న ప్రకటన చూసినప్పుడల్లా 1995 ఆగస్టు నుంచి 1996 జనవరి 18 దాకా జరిగిన పరిణామాలను చూసినవారు వికలమవుతుంటారు. ఎందుకూ మళ్లీ చంపడానికా అని ఆవేదనగా నిందిస్తుంటారు. చంద్రబాబునాయుడైతే కొంతకాలం ఆయన విగ్రహాలు, ఫొటోలు లేకుండా చేసి, అంతా తానే అని నడిపించుకోవాలని చూశాడు. తన ముఖానికి విలువ లేదని, ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటేనే బతుకు ఉంటుందని గ్రహించిన తర్వాత మళ్లీ విగ్రహ పూజ మొదలుపెట్టారు. చంద్రబాబు ఆయన బృందాన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. అందుకే ఆయన ఇప్పుడు కేంద్రంపై యుద్ధం చేస్తున్నానంటే ఇదంతా నాటకమని జనానికి అర్థమైపోతున్నది. నాలుగేండ్లు అంటకాగి ఇప్పుడు ఏదో పోరాటయోధునిలా పోజు పెడితే జనం ఎలా నమ్ముతారు? ఎంత కష్టపడినా చంద్రబాబుకు రావలసినంత గొప్పపేరు రావడం లేదని, ఆయనను అక్కడి మంత్రులు సరిగ్గా పొగడటం లేదని, తెలంగాణలో మంత్రులు, పార్టీ నాయకులంతా పొగడటం వల్లనే కేసీఆర్ విజయాలు సాధించారని చంద్రబాబు చేత, చంద్రబాబు యొక్క, చంద్రబాబు కొరకు శ్రమించే ఒక సీనియర్ జర్నలిస్టు ఇటీవల సూత్రీకరణ చేశారు. పొగిడించుకొని పెద్దవాళ్లయిన నాయకులు చరిత్రలో లేరు. తమ పనుల వల్ల, తమ దక్షత వల్ల, సమర్థత వల్ల నాయకులైన వారే చరిత్రలో నిలిచారు.

వందలాది జాకీలు, క్రేన్లు పెట్టి ఆకాశానికి ఎత్తించుకున్నవాళ్లు ఏనాడైనా చంద్రబాబులాగే ఉంటారు. కేసీఆర్ పొగడ్తల వల్ల ఎదుగలేదు. ఆయన రాజకీయ దార్శనిక దృష్టి, ఆయన పంతంగా అమలుచేసిన పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులు ఆయనకు చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించిపెట్టాయి. కేసీఆర్ స్వయం సాధకుడు. స్వయం ప్రకాశం కలిగిన నేత. పార్టీ, ఉద్యమం, తెలంగాణ సాధన, ప్రభుత్వ సాధన అన్నీ ఆయన స్వయంకృషి ఫలితాలు. ప్రేరక శక్తులు, కారక శక్తులు ఉండవని కాదు. కానీ ఆయనే అందరికీ లీడర్. చంద్రబాబుకు ఆయన స్వయంగా సాధించింది ఒకటి చెప్పండి. మామ పెట్టిన పార్టీని లాక్కున్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ కొత్త పిల్లిమొగ్గ వేసి ఏదో ఒక పార్టీని కలుపుకొని ఎన్నికల్లో పోటీచేస్తూ వచ్చాడు. 1996, 98లలో యునైటెడ్ ఫ్రంట్. 1999లో రాత్రికి రాత్రి వాజపేయి ఫ్రంట్‌లో. 2009లో కేసీఆర్‌తో ఫ్రంట్. 2014 లో బీజేపీ-పవన్‌కల్యాణ్‌తో ఫ్రంట్. ఆయన పరాన్నజీవి. స్వయంప్రకాశం లేని నేత. మ్యానిపులేటర్. గాలివాటంగా ప్రయాణం చేయడం ఆయనకు అలవాటు. అందులో ఎటువంటి విలువలు, సూత్రబద్ధత, నిజాయితీ ఏవీ ఉండవు. తన లాభం, తన మనుగడ. వాడు మనకు పనికొస్తాడా? లేదా?. మనం నిలవడానికి నిచ్చెనగా ఉపయోగపడుతాడా? లేదా?.. అంతే.. అంత రాజకీయ అవకాశవాది. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఒక మహాకీర్తి కిరీటం పెట్టి శంకుచక్ర గదాయుధాలు ధరింపజేసి ఆంధ్ర ప్రజల ముందు మరోసారి మహా నాయకునిగా నిలబెట్టాలని రాజగోపాల్, బాబు మీడియా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు చరిత్రను చెరపలేరు. ఆయన గీతను పెద్దగా చేయలేరు కాబట్టి అవతలివారి గీతలను చిన్నగా చేయాలి. వైసీపీ నేత జగన్‌ను, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ను తక్కువచేసి చూపాలి. వారి ప్రతిష్ఠను దెబ్బతీయాలి. ముగ్గురు మోదీల ప్రచారం అటువంటిదే. నరేంద్ర మోదీతో వైసీపీ-టీఆర్‌ఎస్‌లకు లేని సంబంధాలను అంటగట్టి ప్రచారం చేయాలి. ఆంధ్రలో సెంటిమెంటును రెచ్చగొట్టాలి. తెలంగాణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడినట్టు అక్కడ చంద్రబాబు బ్యాండుమేళం అంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలి.

కానీ తెలంగాణకు అంధ్రకు తేడా ఉన్నదన్న సంగతి ఈ మేళానికి అర్థం కావడంలేదు. తెలంగాణలో చంద్రబాబు ప్రవేశించక ముందునుంచే కేసీఆర్‌కు అనుకూల పవనాలు ఉన్నాయి. ఆయన పాలనకు ప్రజలు మరోసారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని కనీసం నాలుగైదు జాతీయ సర్వేలు వెల్లడించాయి. చంద్రబాబును తిట్టి కేసీఆర్ గెలిచారనే ఒక అల్పపు సూత్రీకరణతో ఇప్పుడు ఆంధ్రలో కూడా అదే సూత్రాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబుకు అనుకూల ఓటు లేదని, ఆయన ఓడిపోబోతున్నారని ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలూ సూచిస్తున్నాయి. ఆయన సెట్టింగులూ, షూటింగులూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు తప్ప నిర్మాణాత్మకంగా సాధించిందేమీ లేదని అక్కడి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. పైగా రకరకాల విపరీత రాజకీయ కెలుకుళ్లతో కొన్ని బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో మరింత విస్మయం, పంతంతో కూడిన వ్యతిరేకత పెంచుకునే దిశగా విపరీతమైన రాజకీయ కొనుగోళ్లకు దిగుతున్నారు. ఎవరికి ఎంతయినా డబ్బు ఇచ్చి పార్టీలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నాయకులతో చర్చలు జరుపడమే గాక తన తండ్రి హత్య కేసుకు టీడీపీకి సంబంధం లేదని ప్రకటించడం రంగా అభిమానుల్లో ఆగ్రహావేశాలు జనింపజేసింది. పవన్‌కల్యాణ్‌పై ఒకవైపు అత్యంత నీచమైన ప్రచారం సాగిస్తూ మరోవైపు ఆయనను దారికి తీసుకొచ్చుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు ఎంతో ప్రయాసపడి ఇతర పార్టీల నాయకులను తెచ్చుకుంటున్నారు. చాలామంది టీడీపీ, ఇతర పార్టీల నేతలు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వైసీపీలో చేరుతున్నారు. బాబుకు అనుకూల పవనాలు లేవు. అనుకూల రాజకీయ ఫిరాయింపులు లేవు. ఆయనకున్నదల్లా అనుకూల మీడియా. అబద్ధాల ప్రచార యంత్రాంగం. ఇవి ఏదీ సాధించబోవు అనడానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *