mt_logo

కల్వకుంట్ల కవితకు ప్రశంసల వెల్లువ.. 

దేశ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితకు లండన్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో అత్యల్పంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కవిత కృషి చేశారని వక్తలు కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భారత దేశ రాజధానిలో ఒక రోజు దీక్ష చేయడమే కాకుండా ప్రజల్లో  ఈ అంశంపై చర్చ రేకిత్తడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని సైతం నిర్వహించారన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశ పార్లమెంటులో 1950ల్లో  5 శాతం ఉన్న  మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం కేవలం 15 శాతానికి మాత్రమే పెరిగిందని తెలిపారు. 33 శాతం రిజర్వేషన్లు సాధించడం పెద్ద విజయమని, అది సాధించడానికి కవిత కృషి గణనీయమని స్పష్టం చేశారు. కవిత వంటి రాజకీయవేత్తల వల్లనే మహిళా రిజర్వేషన్లు సాధ్యమైందని అన్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం కోసం కవిత ఎనలేని కృషి  చేశారని కొనియాడారు.  

ఆకట్టుకున్న కవితపై వీడియో ప్రదర్శన

మహిళా రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత చేసిన కృషిపై  బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రదర్శించిన ఒక వీడియో సభికులను ఆకట్టుకుంది. 2014లో మొట్టమొదటి సారిగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం పనిచేశారని ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్లపై తీర్మానాన్ని ఆమోదించి కేసీఆర్ చరిత్రను సృష్టించారని వివరించింది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కల్వకుంట్ల కవిత తరుచూ మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో లేవనత్తేవారని తెలిపింది. ఆ తర్వాత కాలంలోనూ అనేక సందర్భాల్లో  ఆయా వేదికలపై ప్రస్తావిస్తూ ప్రజా బాహుళ్యంలో ఈ  అంశంపై చర్చను సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేసింది.