ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9వ తేదీని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజాకవి కాళోజీ పురస్కారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన అవార్డును మొదటిసారి సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్ అందుకోనున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ కు పురస్కారం కింద రూ. 1లక్షా వేయి నూటపదహార్లు నగదు అందజేయనున్నారు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవలు చేసిన అమ్మంగి వేణుగోపాల్ తొలి పురస్కారం అందుకోవడం సముచితమని వ్యాఖ్యానించారు. అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీ పేరిట ఏర్పాటుచేసిన పురస్కారాన్ని మొదటిసారి తాను అందుకోవడం గొప్ప అవకాశమని, తెలంగాణ సాహిత్య చరిత్రలోనే ఇది గొప్ప పురస్కారమని, దీనిని తాను జీవిత సాఫల్య పురస్కారంగా భావిస్తున్నానని అన్నారు.
ఇదిలావుండగా కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా చైనా నుండి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు అత్యంత గౌరవ ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. పోరాటాలతో, ఆరాటాలతో, త్యాగధనులతో నిలిచిన తెలంగాణ చరిత్రనిండా కాళోజీ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని తెలిపారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తన గొడవగా భావించి నా గొడవ పేరుతో ఆయన వెలువరించిన సాహిత్యం తెలంగాణ ప్రజల గొడవగా కీర్తి గడించిందని, అందుకే తెలంగాణ భాషకు కాళోజీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.