హైటెక్ ధర్నాలతో కాంగ్రెస్ నేతలు పగటి వేషాలు వేస్తున్నారని, అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రజలను పట్టించుకోకుండా అవినీతి కుంభకోణాలతో కాలం గడిపిన కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ళ నుండి జలయజ్ఞం ప్రాజెక్టుల వరకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని, ఆ సొమ్మును అణా పైసలతో సహా కక్కిస్తామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. టీఆర్ఎస్ఎల్పీలో మంగళవారం బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తలపెట్టిన అన్ని పథకాలు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు పడుకున్నా, లేచినా కేసీఆరే కనిపిస్తున్నారని, సీఎం కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు.
రైతుల రుణమాఫీ, విద్యుత్ కోతల నివారణ, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలు కనిపించడం లేదా? అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను పట్టించుకోకుండా ఇప్పుడు ఏడిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ మోసం, నీచపు, పాపపు చరిత్ర ఎవరికి తెలవదు? ఇప్పుడు నువ్వు కేసీఆర్ ను విమర్శించే సిపాయివి అయ్యావా? నీ చరిత్ర బయటకు తీసి, నీ బతుకు చిట్టా విప్పమంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు, నీ సోదరుడు చేసిన మోసాలు బయటకు తీయమంటావా? మిడ్ మానేరు సంగతేంటి? మొదటి కాంట్రాక్టర్ ఎవరు? మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరికి ముట్టాయి? అని ప్రశ్నించారు.