mt_logo

ప్రాజెక్టు దండుగ అన్నోళ్ల నోర్లు మూత‌ప‌డేలా.. కాళేశ్వ‌రం పంపుల జ‌ల‌గ‌ర్జ‌న‌!

-లక్ష్మీబరాజ్‌ నుంచి ఎత్తిపోతలు షురూ

-4 పంపులతో 8వేల క్యూసెక్కుల లిఫ్టింగ్‌

-ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో.. సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

-వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లోనూ జ‌ల‌స‌వ్వ‌డి

కాళేశ్వ‌రం ప్రాజెక్టు దండుగ‌.. క‌రెంట్ బిల్లులకు తెలంగాణ అప్పులు చేస్తున్న‌ది. ప్ర‌తి ఎకరాకు నీరంద‌ది. ఇవీ తెలంగాణ‌కు క‌ల్ప‌త‌రువులాంటి ప్రాజెక్టుపై ప్ర‌తిప‌క్షాలు పేలిన‌ అవాకులు చెవాకులు. ఇప్పుడు ఆ నోళ్ల‌న్నీ మూత‌ప‌డేలా కాళేశ్వ‌రం పంపులు జ‌ల‌గ‌ర్జ‌న చేశాయి. రుతుప‌వ‌నాలు ఆల‌స్యం కావ‌డం, వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొనే అవ‌కాశం ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి ఎత్తిపోత‌లు ప్రారంభించి తెలంగాణ‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవ‌స‌ర‌మేమిటో ఎగిసిప‌డుతున్న జ‌లాల సాక్షిగా అంద‌రి తెలియ‌జెప్పింది తెలంగాణ స‌ర్కారు. వ‌ర్షాలు ప‌డ‌కున్నా ప్ర‌తి ఎక‌రాకు నీరందేందుకు  కాళేశ్వర జలాలతో జలాశయాలన్నింటినీ నింపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు అన్ని పంపులనూ ఆన్‌ చేశారు. లక్ష్మీబరాజ్‌ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. వ‌ర్షాలు ముఖం చాటేసినా పంపుహౌస్‌ల‌నుంచి ఉప్పొంగిన జ‌లాల‌ను చూసి యావ‌త్తు తెలంగాణ మురిసిపోతున్న‌ది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అధికారులు ఎత్తిపోతలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. లింక్‌-1 లక్ష్మీ పంప్‌హౌస్‌లో ఆరు పంపుల ద్వారా 13.200 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతి బరాజ్‌లోకి తరలిస్తున్నారు. అక్కడ లింక్‌-2లో నాలుగు పంపులతో 11.720 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్‌లోకి, అక్కడి నుంచి నాలుగు మోటార్ల ద్వారా 10,440 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన జలాలను ఒకవైపు ఎస్సారెస్పీకి, మరోవైపు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.

ప్రాణహితలోకి  వ‌ర‌ద 

గోదావరిలో ఎక్కడ వరద ప్రవాహాలు లేకపోయినా ప్రాణహిత లో మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం సగటున 6,500 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీ బరాజ్‌(మేడిగడ్డ)కు చేరగా నీటి ప్రవాహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం 12,500 క్యూసెక్కుల వరద రాగా, అది సోమవారం సాయంత్రం నాటికి 27,500 వేలకు పెరగడం విశేషం. వచ్చే మూడు రోజుల్లో ఈ వరద మరింత పెరుగనున్నదని, గరిష్ఠంగా 76 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన లక్ష్మీబరాజ్‌ ప్రస్తుతం 5.5 టీఎంసీలకు చేరుకొన్నది. అధికారుల అంచనా ప్రకారం రాబోయే వారం రోజుల్లోనూ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకొనే అవకాశమున్నది.

ఇప్పటికే ఎస్సార్‌ఆర్‌ నుంచి రంగనాయకసాగర్‌కు

ఇప్పటికే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను నింపేందుకు పంపులను అధికారులు ప్రారంభించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయం లో నీటిని తరలిస్తున్నారు. 3.5 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం అన్నపూర్ణలో 2.75 ఉండగా, పూర్తిస్థాయిలో నింపాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పంపింగ్‌ ప్రారంభించారు. రంగానాయకసాగర్‌లో మూడు టీఎంసీలకుగాను ఇప్పటికే 1.9 టీఎంసీలను నింపగా, పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకే ఒక పంపును ఆన్‌ చేసి 3,200 క్యూసెక్కుల నీటిని రంగనాయకసాగర్‌కు తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు పంపింగ్‌ కొనసాగింది.