-ఏపీ సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున కితాబు
ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం చీకటైతదన్నారు. తెలంగాణోళ్లకు పరిపాలన చేతకాదన్నరు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతదని సమైక్య పాలకులు శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ.. సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ ఇప్పుడు అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. నవ్విన నాపచేనే పండుతదన్నట్టు తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో మనకు శాపనార్థాలు పెట్టినవాళ్లకే రోల్‌మాడల్‌గా తయారయింది. అందుకే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు మన అభివృద్ధిని కొనియాడుతున్నారు. మన పరిపాలనను మెచ్చుకొంటున్నారు.
తాజాగా, పదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి చూసి ఏపీ సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఆశ్చర్యపోయారు. తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని కితాబిచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇతర దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన పీవీ మార్గ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి, అబ్బురపడ్డారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనకు నిదర్శనమని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌గా తాను ఉమ్మడి రాష్ట్రంలో పని చేశానని, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.