mt_logo

కాళేశ్వ‌ర గంగ ప‌రుగులు.. రంగనాయకసాగర్‌కు తరలుతున్న జలాలు..

తెలంగాణ‌లో కాలంకాకున్నా ఒక్క ఎక‌రా కూడా ఎండ‌కుండా రాష్ట్ర స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో ఆవిష్కృత‌మైన కాళేశ్వ‌రం నుంచి జ‌లాలు మన భూముల‌ను త‌డుపుకొనేందుకు ప‌రుగు ప‌రుగున వ‌స్తున్నాయి. వ‌ర్షాలు లేక అన్న‌దాత క‌న్నీళ్లు అనే వార్త‌ల‌ను త‌న‌లో క‌లిపేసుకొని కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యంగా దిగువ నుంచి ఎగువకు గలగలా పారుతున్నది. వరద కాలువకు కాళేశ్వరం జలాలు వడివడిగా చేరుతున్నాయి. ప్రస్తుతం ఆ కాలువ నిండుకుండలా మారుతున్నది. లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి సరస్వతీ, పార్వతీ పంప్‌హౌస్‌ బరాజ్‌లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు.

అక్కడి నుంచి టన్నెల్స్‌ ద్వారా నందిమేడారం, గాయ త్రి పంప్‌హౌస్‌లకు అక్కడి నుంచి వరదకాలువలోకి జలాలను తరలిస్తున్నారు. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాల్వ మొత్తం సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ఎప్పుడంటే అప్పుడు ఇటు ఎస్సారెస్పీకి, అటు రాజరాజేశ్వర జలాశయానికి కాళేశ్వర జలాలను తరలించే విధంగా ప్రస్తుతం వరద కాల్వను సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు నీటి లెవల్‌కు వరద కాలువను నింపడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్‌కు సైతం కాళేశ్వర జలాల తరలింపు కొనసాగుతున్నది. వరద కాలువ ఉన్న తూముల ద్వారా చెరువులకు నీళ్లు చేరుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ నిరంతర పర్యవేక్షణ

కాళేశ్వరం జలాల తరలింపు ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ మేరకు జలాలను, ఎన్ని పంపుల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఆయా రిజర్వాయర్లల నీటి నిల్వలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారానే పరిశీస్తున్నారు. మరోవైపు ప్రాణహిత లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.