mt_logo

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు.. కాళేశ్వర చంద్రశేఖర్ రావు

  • కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు
  • కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం
  • శివుని నెత్తిపై గంగమ్మ… తెలంగాణ నెత్తి మీద కాళేశ్వర గంగ
  • కాళేశ్వరం దేశానికే గర్వకారణం
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి

నిజామాబాద్, జూన్ 7: కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేసీఆర్ అంటే… నీళ్లు. కేసీఆర్ అంటే… అమ్మ తీరు ఆలోచించడం అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి కేసీఆర్ దుఃఖించిన తీరును తాను చూశానని చెప్పారు. గతంలో ఎండిపోయిన పాలమూరు ఇవాళ పచ్చని పైట కప్పుకున్నదని సీఎం కేసీఆర్ సంతోషిస్తున్నారని తెలిపారు. “మన బిడ్డలకు ఏమైనా సుస్తి చేస్తే వాళ్లు మంచిగయ్యేదాక వదిలిపెట్టం మనం. అమ్మ ప్రేమ అలా ఉంటుంది. కేసీఆర్ ది తెలంగాణ పట్ల, రైతుల పట్ల తల్లి ప్రేమ. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం వంటి ప్రతీ చిన్న అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే అది భగీరథ ప్రయత్నం అనడంలో అతిశయోక్తి లేదు. శివునికి నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంటే తెలంగాణ నెత్తి మీద కాళేశ్వరం గంగను తెచ్చింది సీఎం కేసీఆర్. ఇతం చేసిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు… కాళేశ్వర చంద్రశేఖర్ రావు గా పేరు మార్చకోవాలి” అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశంలో, ఆసియా ఖండంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని, అటువంటి ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 81 మీటర్ల నుంచి 613 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అతిగోప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని స్పష్టం చేశారు. దేశానికి గర్వకారణంగా ఉండే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కల్పించకపోవడం సిగ్గుచేటని  మండిపడ్డారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువ లబ్దీపొందింది నిజామాబాద్ జిల్లా అని తెలిపారు. 

ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ 

రాష్ట్రంలో ప్రాజెక్టులు లేని కాలంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఉండేదని, తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడిన సందర్భాలను చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకొని ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పెట్టకొని రీచార్జ్ చేసుకున్నామని, హల్దీవాగుతో నిజాం సాగర్ ను నింపుకున్నామని వివరించారు. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా చెరువులన్నీ నిండుకుండలా ఉండాలని, మత్తడి దుంకాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచననని స్పష్టం చేశారు. అందు కోసం సాగునీటి రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యి వారిని సీఎం కేసీఆర్ ఒప్పించారని అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడు నిజమైన రాజకీయ నాయకుడని స్పష్టం చేశారు.ఆనాడు మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ ఆ రోజు ఒప్పందం చేసుకోవడం వల్లనే నిజామాబాద్ జిల్లా నిండుకుండగా మారిందని, అన్నపూర్ణగా ఉందని తెలియజేశారు.  

నిజామాబాద్ జిల్లాలో లక్షా 81 వేల ఎకరాలు కాళేశ్వరం జలాలతో సాగవుతాయని తెలిపారు. చెక్ డ్యాముల నిర్మాణం వల్ల జిల్లాలో నీటి మట్టం 15 మీటర్లు పెరిగిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో గతంలో జరిగిన దాని కంటే మంచి ఇప్పుడే జరుగుతోందన్నారు. అప్పటి ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరపలేదని, ఏనాడూ నిబద్ధత చూపించలేదని విమర్శించారు. నీటి వనరులు లేకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ పాలనలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా నిజామాబాద్ జిల్లాకే చెందిన సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ ఘోరాలు జరిగాయని మండిపడ్డారు. అప్పటి పాలకుల చేతిలో సుదర్శన్ రెడ్డి కీలు బొమ్మగా ఉండేవారని, అంతకు మించి ఆధికారాలు ఉండేవికావన్నారు.