న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ దేశానికి చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన భేటీలో జాప్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్‌రెడ్డితో మంత్రి చర్చించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జాప్‌కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్పత్తులను జాప్‌కామ్ కంపెనీ రూపొందించనున్నది. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాతో పాటు సెంట్రల్ అమెరికా, ఇండియాలోనూ జాప్‌కామ్ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాప్‌కామ్ కంపెనీ మొదట 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. ఆ తర్వాత సంవత్సరంలోమరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.