mt_logo

అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట కకావికలం అవుతుంది: జగదీశ్ రెడ్డి

నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కడతారని.. అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం అవుతుంది అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయం చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను అరెస్టు చేశారు అని అన్నారు.

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం
కకావికలం అవుతుంది. అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలంలో మూగజీవాలకు గడ్డి దొరకదు అని పేర్కొన్నారు

అవసరం అయితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డం పడ్డ కోదండరాం ఎందుకు మాట్లాడటం లేదు. మూసీపై కోదండరాం ఎందుకు మాట్లాడటం లేదు. హరగోపాల్ ఎందుకు ప్రభుత్వ నిర్ణయాలపై తన గొంతు విప్పడం లేదు.. పదవుల కోసమే మేధావులు తమ గొంతును విప్పడం లేదా అని ప్రశ్నించారు.

దామగుండం, రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీతో మూసీ నది కాలుష్యం అవుతుంది..నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కడతారు అని జగదీశ్ రెడ్డి అడిగారు.

మోడీకి బీ టీమ్‌గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది.. తెలంగాణలో మోడీ, రేవంత్ మిలాఖత్ స్పష్టం అవుతోంది. వాల్మీకి స్కామ్‌లో కర్ణాటక నేతలపై చర్యలు తీసుకున్న ఈడీ తెలంగాణలో ఎందుకు విచారణ చేయలేదు అని ప్రశ్నించారు.

రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా చివరి వరకు అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు.