హైదరాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తొలిదశ తనిఖీలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఈవీఎంల తనిఖీ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్ ఈ రోజు సాయంత్రం పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకై 3,826 పోలింగ్ కేంద్రాలు ఉండగా 6,120 బ్యాలెట్ యూనిట్లు (బి.యు), 4,780 కంట్రోల్ యూనిట్లు (సి.యు)లు, 5,170 వివిప్యాట్‌ల తనిఖీలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించనున్నట్టు దానకిషోర్ తెలియజేశారు. ప్రతిరోజు కనీసం 700 ఈవీఎంల తనిఖీ చేసే అవకాశం ఉందని, ఇది 20రోజులకు పైగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈవీఎంల తనిఖీలను సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు హాజరయ్యే సిబ్బంది, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీచేయనున్నట్టు తెలిపారు. విక్టరీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్, సందీప్‌జా, జాయింట్ కమిషనర్ పంకజ తదితర అధికారులు పాల్గొన్నారు.