బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణలో సంబురంగా జరిపే బతుకమ్మ పండుగపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, సీపీలు హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. బతుకమ్మ సంబురాల నిర్వహణలో తెలంగాణ ముఖచిత్రం ప్రతిబింబించాలని సీఎస్ ఎస్‌కే జోషి అన్నారు.