సీఎం కేసీఆర్ విజన్.. మంత్రి కేటీఆర్ కఠోర శ్రమతో తెలంగాణలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. రాష్ట్రంలో పారిశ్రామీకరణ కొత్తపుంతలు తొక్కుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్/తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం)ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. తెలంగాణ పారిశ్రామిక విధానం-2015ను 2015 జూన్ 12న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ విధానంలో సింగిల్‌విండో విధానంలో పరిశ్రమలు అనుమతులు ఇస్తున్నారు. అలాగే, తెలంగాణలో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, జిల్లా నలుమూలలకు విస్తరిస్తున్నది. జిల్లాల్లోనూ
పారిశ్రామిక వాడలు వెలుస్తున్నాయి. కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి తెలంగాణ సర్కారు సాదర స్వాగతం పలుకుతున్నది.
పారిశ్రామిక వాడల్లో 1800 ప్లాట్లు సిద్ధం!
తెలంగాణలో కొత్త ఇండస్ట్రీలకోసం వివిధ జిల్లాల్లో టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసింది. ఇందులో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామికవాడల్లో కలిపి 1800 ప్లాట్లను సిద్ధం చేసింది. ఇందులో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి తెలంగాణ సర్కారు ప్రోత్సాహకాలు అందించనున్నది. పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసుకొంటే బ్యాంకు నుంచి రుణం పొందే సౌకర్యం కూడా ఉన్నది. అనంతరం ఆ డబ్బులతో నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇందులో జనరల్ ఇండస్ట్రియల్ పార్కులతోపాటు వివిధ ప్రత్యేక రంగాలకు సంబంధించిన పార్కులు ఉన్నాయి. జనరల్ పార్కుల్లో ఏ పరిశ్రమనైనా పెట్టుకొనేందుకు అనుమతి ఇస్తుండగా.. టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో వాటికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుంటుంది.
పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల వివరాలు..
-జోన్లవారీగా ఆయా జిల్లాల్లో 500 చదరపు మీటర్ల నుంచి గరిష్ఠంగా 15 ఎకరాల వరకు వైశాల్యం గల ప్లాట్లను టీఎస్‌ఐఐసీ సిద్ధం చేసిది.
-స్థానిక ల్యాండ్ రేట్ల ఆధారంగా వీటి ధరలను నిర్ధారించారు.
-ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యంతో అన్ని రకాల వసతులతో షెడ్లు సిద్ధంగా ఉన్నాయి.
-పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకొనేవారు టీఎస్‌ఐఐసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ప్లాట్లను పొందొచ్చు.