mt_logo

స్వరాష్ట్రంలో పరిశ్రమలకు స్వర్ణయుగం – దశ దిశలా తెలంగాణ వికాస హేల

• 9 ఏండ్లలో రాష్ట్రానికి  23 వేల పరిశ్రమలు..

• ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.. 

17 లక్షల 77 వేల మందికి ఉపాధి..

పరిశ్రమల ప్రాభవం..నా తెలంగాణ..

పెట్టుబడులకు స్నేహపూర్వక హస్తం..

ప్రపంచానికి ఆదర్శంగా టీఎస్ఐపాస్..

15 రోజుల్లోనే అనుమతులు పాస్..

హైదరాబాద్,జూన్ 6:  వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్లుగానే ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణను 23 వేల పరిశ్రమలకు అడ్డాగా మార్చారు. ఈ పరిశ్రమల ద్వారా 17 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ముఖ్యంగా ఐటీ, ఔషధాలు, ఆహార శుద్ధి, విమానయానం తదితర రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి దార్శనికతకు తోడు పరిశ్రమల శాఖ గౌరవ రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి కే.టి.రామారావు ప్రత్యేక చొరవతో అనేక దేశీయ, విదేశీ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.2015 లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐపాస్ చట్టాన్ని తీసుకురావటంతో ప్రపంచస్ధాయి కంపెనీలు తెలంగాణ వైపు చూడటం మొదలుపెట్టాయి. 

పెట్టుబడులకు ఉన్న అడ్డంకులు తొలగు, సులభతర అనుమతులు లభించటంతో రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. పరిశ్రమలకు కావాల్సిన భూమి సిద్ధం చేయడం,ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించటం, స్నేహపూర్వక విధానాలు, మెరుగైన ప్రోత్సాహకాలతో తెలంగాణకు ఎదురులేకుండా పోయింది. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి నగరాలను కాదని తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల ఎకరాలను పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే 28,000 ఎకరాల భూమిని వివిధ కంపెనీలకు కేటాయించారు. ఇందులో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తదితర పారిశ్రమామిక వాడలు ముఖ్యమైనవి.

ముఖ్యమైన ఇండస్ట్రియల్ పార్కులు:

ఫార్మాసిటీ: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే  అతి పెద్ద సమీకృత ఔషధ క్లస్టర్ గా దీన్ని 14,029 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. 64,000 కోట్లు రూపాయాలు పెట్టబడులు వస్తాయని , 4 లక్షల 20 వేల మందికి ఉపాధి లబిస్తుందని అంచనా. మొదటి దశ క్రింద 8 వేల 9 వందల ఎకరాలలో ఔషద పార్క్ అభివృద్ధికి ప్లానింగ్ పూర్తి అయ్యింది.

జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్: మల్టీ ప్రొడక్ట్ తయారీ జోన్ ను ప్రతిపాదించారు. 12 వేల 635 ఎకరాల్లో నిమ్జ్ పథకం కింద మొదటి దశలో 3,909 ఎకరాలు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.13,300 కోట్లు కాగా, రూ.60,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 2 లక్షల 77 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా, మాస్టర్ ప్లాన్ , ఈఎస్ఐఏ అధ్యయనం పూర్తయింది. హైదరాబాద్ –నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు

ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ : మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేశారు. ఇందులో రావిర్యాల క్లస్టర్ 603 ఎకరాల్లో, మహేశ్వరం క్లస్టర్ 310 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ-సిటీ లో 48 కంపెనీలకు భూములు కేటాయించగా, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.1,585 కోట్ల పెట్టుబడులు రాగా, వచ్చే ఏడాది మరో రూ.2,626 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా, మహేశ్వరం క్లస్టర్ లో 14 కంపెనీలకు భూములు కేటాయించగా, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో రూ.472 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5,216 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వచ్చే ఏడాది చివరికల్లా ఇందులో ఖాళీ జాగాను కూడా కంపెనీలకు కేటాయించనున్నారు.

ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం లోని ఖాల్సా గ్రామంలో 123 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదించారు. 43 కంపెనీలకు భూమి కేటాయింపు పూర్తయ్యింది. రూ.55 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే జూన్ నాటికి ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.

చందన్ వల్లి ఇండస్ట్రియల్ పార్క్ : సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందన్ వల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేశారు. ఇది మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్. 20,000 ఎకరాల్లో ప్రతిపాదించారు అత్యుత్తమ కార్పెట్ టైల్స్ తయారీ సంస్థ వెల్ స్పన్ ఫ్లోరింగ్ , గ్రీన్ కార్పెట్స్, ఇప్పటికే ఇక్కడ త్పత్తులు ప్రారంభించాయి. పలు కంపెనీలకు కూడా భూములు కేటాయించగా , ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి.

దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ : తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టీఐఎఫ్) భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 523 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేశారు. ఇందులో 621 కంపెనీలకు ఇప్పటికే భూములను కేటాయించగా, రూ.1,200 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 19,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

సుల్టాన్ పూర్ ఎఫ్ టీసీసీఐ ఎఫ్ ఎల్ వో పార్క్ : ఎఫ్ టీసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ కు సుల్తాన్ పూర్ లో 50 ఎకరాలు కేటాయించారు. ఎంఎస్ఎంఈల గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటునకు 26 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యింది.

మెడికల్ డివైజెస్ పార్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం సుల్లాన్ పూర్ లో 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను అభివృద్ధి చేశారు. ఇందులో 50 కంపెనీలు ఏర్పాటు కాగా, రూ.839 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5,465 మందికి ఉపాధి లభించింది.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : 1,190 ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. రూ.11,586 కోట్ల పెట్టుబడలు వస్తాయని, 1,13,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా, గణేశా ఎకోస్పేర్, కిటెక్స్, యంగ్ వన్ కార్పొరేషన్ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే రూ.2,527 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా 22,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీలు త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నది.

పరిశ్రమల వెల్లువ

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది.  దీనికి తోడు 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైంది.

సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు,పవర్ హాలీడేస్, నీటికొరత కారణంగా అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. పారిశ్రామిక వేత్తలు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఈ సమస్యలన్నింటికీ సమూల పరిష్కారం లభించింది. నేడు టీఎస్ ఐపాస్ వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంతో ఉత్సాహంతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతోపాటు,  సత్వరం అనుమతులూ, ఎక్కడా అవినీతికి చోటులేక పోవడం పారిశ్రామిక వేత్తలకు ఆనందం కలిగిస్తోంది.  ఇప్పటివరకూ 2,64,956 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.  17 లక్షల 77 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి 

ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్ల రూపాయల నుంచి లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 220 శాతం వృద్ధిరేటు నమోదయింది. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3 లక్షల 23 వేల 396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 8 లక్షల 27వేల 124కి పెరిగింది. 

ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటలలో కూడా ఐటీ టవర్లను నిర్మించారు. ఎస్.సి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 1400 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించారు. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్లను పునరుద్ధరించారు.

రాష్ట్ర అవతరణ తరువాత హైదరాబాద్ మహానగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సులకు మనకు ఆహ్వానాలు అందుతున్నాయి. గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలేగాక, ఈ మధ్యన ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. 

ఇదీ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదీ మన రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయంగా సాధించిన ఖ్యాతి. ఇది తెలంగాణపై ఇతర దేశాలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడిస్తున్నది. వినూత్న ఆవిష్కరణలతో ముందుకువచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు  టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ , రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. వినూత్న స్టార్టప్ ల ఆవిష్కరణల్ల టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించింది. అందుకే టీ-హబ్-2 ను కూడా ప్రారంభించుకున్నాం. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ-హబ్  ఉత్తమ ఇంక్యుబేటర్ గా నిలిచింది.