mt_logo

హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 వేల నుండి 60 వేల కోట్లు: మంత్రి కేటీఆర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ రూ. 9,700 వేల కోట్ల పైననే అని తెలిపారు. కానీ మేము కట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నాం అని స్పష్టం చేసారు.

ఒక్కరోజే 8 చోట్ల 13 వేలకు పైగా ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికలు ప్రజాప్రతినిధుల పాత్ర లేదు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందితే చాలు అన్న సీఎం కేసీఆర్ మార్గదర్శనం మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశాం అని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు అని తెలిపారు. ఈరోజు జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 30 వేల ఇండ్లు లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. మిగిలిన 70 వేల ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
ఒక్క లబ్ధి దారుడైన ఒక్క రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పాలన్నారు. భారతదేశంలో ఇంకా ఎక్కడైనా ఇంత పెద్ద పక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా? అని అడిగారు. పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం నిలుస్తుందన్నారు. ఇంత పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు అభినందనలు తెలిపారు.

ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు
కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పేదలకు న్యాయం జరుగుతున్నది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. పేదలపైన, రైతులపైన కేసీఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించలేని కొన్ని పార్టీలు ఈరోజు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్న వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.