mt_logo

తెలంగాణలో ఏకంగా 7.3% పేదరికం కనుమరుగు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 

పేదరికం తగ్గుముఖం

“సంపద పెంచు – ప్రజలకు పంచు’’ అనే సదాశయంతో “తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నదని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని” నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీన పేదరిక సూచీ స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడో వంతు గా నమోదైంది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం,  2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తోంది. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకు అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.  వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసింది. అదే విధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నది. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలను అనుకుంటున్నది.

అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనా కు జై కొడుతున్నారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకు, పటిమకు తిరుగులేని నిదర్శనం. మీ అందరికీ మరోమారు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తినీ, విలువలను ముందుకు తీసుకు పోయే క్రమంలో యావత్ భారత జాతి ఒక్కటిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సమాపన వేడుకలను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తున్నానని పేర్కొన్నారు.