mt_logo

నీరా సేవిస్తే… ఆరోగ్యానికి మంచిదన్న మంత్రి

  • గిరక తాడు ఎక్కి.. నీరా తీసిన మంత్రి ఎర్రబెల్లి
  • నీరా సేవిస్తే… ఆరోగ్యానికి మంచిదన్న మంత్రి

పాలకుర్తి: ఏదైనా పథకాన్ని ప్రారంభించడమే కాదు ఆ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ తెలుసుకోవడం మంత్రి ఎర్రబెల్లికి అలవాటు. ఆయా పథకాల లోటుపాట్లను కూడా అంచనా వేస్తూ సమర్థవంతంగా ఆయా పథకాలను ప్రజలకు అందేలా చేయడం ఆయన నైజం. అలా మూడేళ్ల కింద తన సొంత ఖర్చులతో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గిరకతాటి చెట్లను మంత్రి ఎర్రబెల్లి గౌడ సోదరులకు పంపిణీ చేశారు. అప్పుడప్పుడు ఆయా పర్యటనల్లో ఆ గిరిక తాళ్లు ఎలా ఉన్నాయి? ఏపుగా పెరిగాయా?! కల్లు (నీరా) వస్తుందా? అంటూ ఆరా తీస్తూ ఉంటారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో పలు పరామర్శలు చేస్తూ పెళ్లిళ్లకు హాజరవుతూ మంత్రి పర్యటించారు. 

ఈ సందర్భంగా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో 3 సంవత్సరాల క్రితం తాను పంపిణీ చేసిన గిరక తాడు కి నేడు కల్లు పారుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి, ఆ కల్లును సేవించారు. కల్లు కు అందునా గిరిక తాటి కల్లు కు ఔషధ గుణాలు ఉన్నాయని, సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. అంతేకాదు గిరక తాటి చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. మూడేళ్ల క్రితమే తాను స్వయంగా గిరకతాటి చెట్లను పాలకుర్తి నియోజకవర్గం లో పంపిణీ చేశానని తెలిపారు. ప్రస్తుతం అవి కల్లుని ఇస్తున్నాయని ఆ కల్లుని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కళ్ళుకి మంచి డిమాండ్ ఉందని మంత్రి వివరించారు.