హైదరాబాద్ ఇక ట్రాఫిక్ ఫ్రీ నగరం కాబోతుంది. ఇప్పటికే నగరానికి తూర్పువైపు పలు వంతెనలు అందుబాటులోకి రాగా, ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కుడివైపు అండర్‌పాస్ వినియోగంలోకి వస్తే ట్రాఫిక్ సమస్యకు మరింత పరిష్కారం లభించనుంది. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ ప్యాకేజీలో భాగంగా ఎల్‌బీనగర్, నాగోల్, బైరామల్‌గూడ ప్రాంతాల్లో 448 కోట్లతో వంతెనలు, అండర్‌పాస్ ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నాగోల్ కామినేని ఆస్పత్రి వద్ద కుడి, ఎడమ వైపు వంతెనలు, ఎల్‌బీనగర్ చౌరస్తా వద్ద దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్లే ఫ్లైఓవర్, బైరామల్‌గూడ జంక్షన్‌లో కుడి వైపు వంతెన ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్ చౌరస్తా వద్ద 14.87 కోట్లతో కుడివైపు అండర్‌పాస్ నిర్మాణం జరుగుతోంది. రెండు లేన్లు, 490 మీటర్ల మేర పనులు చేపట్టారు. ఈ జంక్షన్‌లో దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్ వైపు నిర్మించిన ఎడమవైపు వంతెన ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నాగోల్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట, శంషాబాద్ వైపు, బైరామల్‌గూడ నుంచి నాగోల్, ఉప్పల్ వైపు సిగ్నల్ చిక్కులు లేకుండా వాహనదారులు రాకపోకలు సాగించేందుకు రెండు అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఎడమ వైపు అండర్‌పాస్ వినియోగంలోకి వచ్చిన దృష్ట్యా… ఫిబ్రవరిలో కుడి వైపు అండర్‌పాస్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో ఎల్‌బీనగర్‌లో 447 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-1 పనుల్లో మెజార్టీ పూర్తయినట్టవుతుంది. ఈ మార్గంలో ఉప్పల్ రింగ్ రోడ్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఒకటీ రెండు ట్రాఫిక్ సిగ్నల్స్ మినహా పెద్దగ ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ఇక బైరామల్‌గూడ వద్ద ఎడమ వైపు వంతెన, నాగోల్ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయి. 70.71 కోట్లతో నిర్మిస్తోన్న తుకారాంగేట్ ఆర్‌యూబీని కూడా వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. 69 కోట్లతో నిర్మిస్తోన్న బహదూర్‌పురా వంతెన పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యేడాదిలో మరో మూడు వంతెనలూ పూర్తి చేయనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఈ వంతెనలు, అండర్‌పాస్ లన్నీ పూర్తయితే హైదరాబాద్ ఇక ట్రాఫిక్ సమస్యలు లేని మహా నగరంగా నిలుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ లో సిగ్నల్ సమస్యలు లేని ప్రయాణం, రహదారుల వ్యవస్థ మెరుగుదల కోసం 29,695 కోట్ల వ్యయంతో ఎస్‌ఆర్‌డీపీ ప్రణాళికలు రూపొందించారు. 54 చౌరస్తాల వద్ద 135 కిలోమీటర్ల మేర వంతెనలు/గ్రేడ్ సెపరేటర్లు/అండర్‌పాస్ లు నిర్మిస్తున్నారు. 166 కి.మీల మేర మేజర్ కారిడార్లు, 348 కి.మీల మేజర్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే పలు దశల్లో దాదాపు 9 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 వంతెనలు, ఆర్‌యూబీలు, నాలుగు అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్, బైరామల్‌గూడ, ఉప్పల్, ఇందిరాపార్కు-వీఎస్‌టీ, బహదూర్‌పురా, అరాంఘర్, జూపార్కు, ఉప్పల్, అంబర్‌పేట-ఛే నెంబర్, కొండాపూర్ బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి-చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి-శిల్పకళావేదిక లే అవుట్ తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.