-ఆకాశాన్నంటే హర్శ్యాలు .. నలుదిశలా ఇండస్ట్రీ హబ్
-హైదరాబాద్ రియల్ గ్రోత్‌పై అధ్యయనం కోసం.. ఇంటర్ స్టేట్ రియల్ సంస్థల ఆసక్తి
తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో భూముల రేట్లు పడిపోతాయి. అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. రియల్ ఎస్టేట్ పడిపోతుంది. హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఆగిపోతుంది.. ఇవి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పడు కొందరి కామెంట్స్. ఇప్పుడు వాళ్లు నోరుతెరిచేలా హైదరాబాద్ దేశానికే రియల్‌గురులా మారిపోయింది. దేశానికే రియల్ పాఠాలను నేర్పబోతున్నది. సమైక్యపాలనలో ఒకప్పటి హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు చాలా మార్పు వచ్చింది. తొమ్మిదేళ్లుగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఊహకందని రీతిలో రూపాంతరం చెందుతున్నది. ప్రణాళికబద్ధమైన ప్రభుత్వ నిర్ణయాలు, వరల్డ్ క్లాస్ మౌలిక వసతులు, ఇండస్ట్రీయల్ ప్రెండ్లీ విధానాలు, గ్లోబల్ సిటీయే లక్ష్యంగా అమలు చేస్తున్న సంస్కరణలతో రియల్ ఎస్టేట్‌కు హైదరాబాద్ దిక్సూచిలా నిలుస్తున్నది. ఇతర రాష్ట్రాల రియల్ వ్యాపారులు నగరానికి వచ్చి అధ్యయనం చేసేంత స్థాయికి చేరుతున్నది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే ఢిల్లీ, ముంబాయి, గుర్గావ్, బెంగళూరు వైపు చూసే సందర్భాలు ఉండేవి. కానీ రియల్ వ్యాపారాన్ని నలుదిశలా విస్తరిస్తూ దేశానికి రియల్ పాఠాలు చెప్పేంత స్థాయిలో హైదరాబాద్ సగర్వంగా నిలబడుతున్నది.
విశ్వనగరానికి ఊతంలా రియల్ డెవలప్మెంట్
విశ్వనగరం వైపు వడివడిగా పరుగులు పెడుతున్న హైదరాబాద్ అన్ని రంగాలతోపాటు రియల్ ఎస్టేట్‌లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన వరల్డ్ క్లాస్ మౌలిక వసతులు, మణిహారంలాంటి అవుటర్ రింగ్ రోడ్డు, ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్‌ను వికేంద్రీకృతం చేసినట్లుగా నలుదిశల విస్తరిస్తున్న ఇండస్ట్రీ హబ్‌లతో నగరం రూపురేఖలు మారిపోయాయి. ఇవే రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు, అత్యధిక స్కై స్క్రాపర్లు, లగ్జీరియస్ ప్రాజెక్టులు, సిగ్నల్ ఫ్రీ విధానాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి అంశాలే రాష్ర్టాల రియల్ రంగ నిపుణులు, సంస్థలు, వ్యాపారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుండగా.. దేశానికి రియల్ వ్యాపారంలో దిశానిర్ధేశం చేసేంతగా ఎదుగుతున్నది.
మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ మన హైదరాబాద్
ఐటీ, ఫార్మా, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ల వంటి ఎన్నో రంగాల్లో హైదరాబాద్ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న డిమాండ్ తగినట్లుగా లగ్జరీ విల్లాలు, 50 ఫ్లోర్ల స్కై స్క్రాపర్లు, విశాలమైన భవంతులు, ఆల్ట్రామోడ్రన్ జీవనశైలిని అందించే రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీనికితోడు పుష్కళమైన ల్యాండ్ బ్యాంక్, ఇతర రాష్ర్టాల ధరలతో పోల్చితే తక్కువ ధరలో స్థిరాస్తుల లభ్యత, వైవిధ్యమైన నిర్మాణ శైలితో రియల్ రంగంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా హైదరాబాద్ నిలుస్తున్నది. ఇలాంటి అంశాలే రియల్ ఎస్టేట్ రంగంలో మహానగరాన్ని అగ్రస్థానంలో నిలిపి, దేశానికి పాఠాలు చెప్పే స్థాయికి చేర్చుతున్నాయి.
హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనానికి రియల్ నిపుణుల క్యూ
క్రమక్రమంగా జరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు గతంలో మహారాష్ట్ర క్రెడాయ్ యూత్ వింగ్ సందర్శించారు. తాజాగా ఇదే తరహాలో దేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా ఉన్న ముంబై, గుర్గావ్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి రియల్ నిపుణులు, వ్యాపారులు, యంగ్ ఆంత్రప్రెన్యూర్లు హైదరాబాద్‌కు రానున్నారు. క్రెడాయ్ ఇండియా నేతృత్వంలో జరుగుతున్న ఈ స్టడీ టూర్‌లో దాదాపు 250 మంది పాల్గొంటారని క్రెడాయ్ ఇండియా జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో ఏటా దేశంలోని అత్యంత ఆదరణ, ఇండస్ట్రీ గ్రోత్ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యటిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఈ టూర్ సాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం షెడ్యూల్ ఖరారు కాలేదని, హైదరాబాద్ స్టడీ టూర్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తమ విల్లాలు, లగ్జరీయస్ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ నిర్మాణాలు, మోడ్రన్ సిటీ ఐకానిక్ సెంటర్ టీ హబ్‌ను సందర్శిస్తారని తెలిపారు.
ఖరీదైన భవంతులు.. ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ మనమే
ఇటీవల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త లక్ష్యాలను చేరుకొంటున్నది. దేశంలోనే ఎక్కువగా ఎత్తైన భవనాలను కలిగి ఉన్న నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గడిచిన కొంతకాలంగా ఈ ట్రెండ్ తారా స్థాయికి చేరుతుంటే.. ఖరీదైన నిర్మాణాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. ఆఫర్డబుల్ ప్రాజెక్టుల నుంచి మొదలుకుంటే రూ.35 కోట్ల ఖరీదు చేసే భవనాల లభ్యత పెరిగింది. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ, వినూత్నమైన ఆర్కిటెక్చర్, రాజభవనాలను తలపించేలా విశాలమైన క్లబ్ హౌజ్‌ల నిర్మాణానికి సిటీ డెవలపర్లు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇవే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు రావడంతో ఇతర ప్రాంతాల వారిని కూడా ఆకట్టుకుంటున్నదని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు.