mt_logo

ఏరోస్పేస్, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్‌, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వెమ్‌ టెక్నాలజీస్‌ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ‘లార్జ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌’ను స్థాపించేందుకు గానూ ఆదివారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌, డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌, వెమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ వీ వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో వెయ్యికి పైగా ఎంఎస్‌ఎంఈలు, డీఆర్డీవో, బీడీఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సూక్ష్మ సంస్థలు పనిచేస్తున్నాయని.. వీటితోపాటు లాక్‌హీడ్‌, బోయింగ్‌, జీఈ, సాఫ్రన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు సైతం హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరులు ఉండటంతో ఏరోస్పేస్‌, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందన్నారు. వెమ్‌ టెక్నాలజీస్‌ పెట్టుబడితో రెండువేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. జహీరాబాద్‌లో వెమ్‌ టెక్నాలజీస్‌ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటంపై మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఈ కేంద్రంతో స్థానిక యువతకు నైపుణ్యాలు పెరిగి, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. వెమ్‌ టెక్నాలజీస్‌ విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టుకు మెగా ప్రాజెక్ట్‌ హోదా ఇస్తామని, వారు కోరినవిధంగా 511 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగేండ్ల కిందట డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తనతో మాట్లాడుతూ 2017-22 మధ్య హైదరాబాద్‌కు రూ.లక్ష కోట్ల రక్షణరంగ ఆర్డర్లు వస్తాయని చెప్పారని, అది ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతున్నదని ఆయన గుర్తుచేశారు.

పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం: సతీశ్‌రెడ్డి

తెలంగాణ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నదని డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి ప్రశంసించారు. అధికారులు ప్రతిక్షణం అందుబాటులో ఉండి, రాష్ట్ర అనుకూలతలను వివరిస్తారని చెప్పారు. నగరంలోని కంపెనీలతో డీఆర్డీవో అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పలు రక్షణరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు చూస్తున్నదని, వెమ్‌ టెక్నాలజీస్‌ వంటి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారతీయ కంపెనీలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొనే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *