mt_logo

ఎంత ఖర్చయినా అందరికీ ఇళ్ళు- సీఎం కేసీఆర్

మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జూన్ రెండు నుండి జరగనున్న రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకు ఎంత ఖర్చయినా సరే, టార్గెట్ మించినా సరే అందరికీ ఇళ్ళు నిర్మించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారని తెలిసింది. ఈ సంవత్సరంనుండే ఈ పథకాన్ని చేపట్టాలని, నియోజకవర్గానికి 500 ఇళ్ళ చొప్పున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించాలని, ఈ నాలుగేళ్ళలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఇటీవల బస్తీల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఆయా కాలనీలు, బస్తీల్లో నివసించే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని, ఒక్క హైదరాబాద్ లోనే రెండు లక్షల ఇళ్ళను నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో వరంగల్ నగర పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ మురికివాడల్లో నివసించే పేదలకు ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను వెంటనే చేపట్టాలని అన్నారని తెలిసింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఓపెన్ బిడ్డింగ్ ద్వారానే కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ రెండునుండి జరగనున్న రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీగా సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పలు కొత్త పథకాలను జూన్ 2న జరిగే ఉత్సవాలలో ప్రకటించాలని నిర్ణయించారు. జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు అదేరోజు నుండి ఉచితంగా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్-ఐపాస్ కు మంత్రివర్గ ఆమోదం లభించింది. తొలుత జూన్ 7న పారిశ్రామిక వేత్తల సమక్షంలో దీనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించినా సమయం ఎక్కువగా లేకపోవడం, ఇంత తక్కువ వ్యవధిలో పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం కుదరదని భావించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన తర్వాత వారి సూచనమేరకు జూన్ 12 కు మార్చాలని క్యాబినెట్ లో నిర్ణయించినట్లు సమాచారం. సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ తో చేసుకున్న ఎంవోయూకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా జూలై రెండో వారంలో పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం, యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధికి సంబంధించిన భూసేకరణకు ఆమోదం తెలిపారు. ఇదిలాఉండగా ఈనెల 29న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జూన్ ఒకటిన జరగనున్న మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏవిధంగా ఓట్లు వేయాలనే అంశంపై తగిన శిక్షణ ఇస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *