mt_logo

అర్చకులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణలో బ్రాహ్మణుల మీద సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.  బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ప్రస్తుతం  ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంచుతున్నామని,  ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తుంది, రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేధ్యం పథకాన్ని విస్తరింపజేస్తామని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సీఎంకు వేదపండితులు కిరీటం ధరింపజేసి, శాలువాలు కప్పి, సాంప్రదాయ పద్దతిలో శంఖారావం,  వేదం మంత్రాలతో ఆశీర్వదించారు.

అనంతరం అక్కడి సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..  రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది,  ఇప్పటివరకూ ధూపదీప నైవేధ్యం పథకం కింది దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామన్నారు.  ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తున్నాను అన్నారు.  వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తామని తెలిపారు.  ఐటిఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపచేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాన్నారు. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినేట్ లో చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు.  సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వాల .. వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కళ్యాణకారిగా ‘తెలంగాణ బ్రాహ్మణ పరిషత్’ ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవ దేవుడిని  ప్రార్థిస్తునాన్నారు.