mt_logo

హ‌రిత‌న‌గ‌రం..మ‌న హైద‌రాబాద్‌.. చారిత్ర‌క న‌గ‌రంలో ప‌రిఢ‌విల్లుతున్న ప‌చ్చ‌ద‌నం

  • అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా మొక్క‌ల పెంప‌కం
  • మ‌హాన‌గ‌రంలో అనూహ్యంగా పెరిగిన గ్రీన్ క‌వ‌ర్‌
  • ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌కు రాష్ట్ర స‌ర్కారు ప్రాధాన్యం

మహాన‌గ‌రమంటే.. కాంక్రీట్ జంగిల్‌..ఎటుచూసినా ఎత్తైన భ‌వ‌నాలు.. సిమెంటు రోడ్లు.. చూద్దామ‌న్నా ప‌చ్చ‌ద‌నం కాన‌రాదు.. న‌గ‌ర‌వాసుల‌కు ఆహ్లాదం అంద‌నంత దూరం. కాంక్రీట్ జంగిల్ విస్త‌ర‌ణ‌తో మ‌నుగ‌డ కోల్పోయిన ప‌చ్చ‌ద‌నం.. ఇది పాత మాట‌.. స్వ‌రాష్ట్రంలో మ‌న చారిత్ర‌క న‌గ‌రం ప‌చ్చ‌ద‌నంతో ప‌రిఢ‌విల్లుతున్న‌ది. తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా అవకాశం ఉన్న చోట‌ల్లా మొక్కలు నాటి, సంర‌క్షిస్తుండ‌టంతో న‌గ‌రంలో అనూహ్యంగా గ్రీన్ క‌వ‌ర్ పెరిగింది. మ‌న హైద‌రాబాద్‌.. ఇప్పుడు హ‌రితన‌గ‌రంగా రూపుదిద్దుకొన్న‌ది. చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. పచ్చని మొక్కలతో పర్యాటక ప్రాంతాలకు కొత్త కల వచ్చింది. చారిత్రక నగరానికి గ్రీన్‌ కవరేజీ అభివృద్ధికి సూచికగా నిలుస్తోంది. ఎవెన్యూ ప్లాంటేషన్‌, ఫ్లై ఓవర్‌ పిల్లర్లు, జంక్షన్‌ బారికేడింగ్‌, మిడ్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌తో విశ్వనగరానికి పచ్చలహారంగా కనిపిస్తోంది. ఇక జంక్షన్‌ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన గ్రీనరీ ప్లాంటేషన్‌తో నగరం పచ్చందాలను అద్దుకుంటోంది.

నాడు వ‌ట్టి చెరువులు, కుంటలు.. నేడు ప‌ర్యాట‌క ప్రాంతాలు..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలు… ఇప్పుడు ఆధునిక తెలంగాణకు ప్రతీకగా మారాయి. ఓవైపు  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్‌ నూతన సచివాలయం, ఆ పక్కనే అమవీరుల స్మార‌క చిహ్నం, రాజ్యాంగ స్ఫూర్తికి నిజరూపంలా అంబేద్కర్‌ భారీ విగ్రహంతో అందమైన పర్యాటక ప్రాంతంగా మారింది. హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలు ఇప్పుడు “హార్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌”గా ఐక్యరాజ్య సమితి టూరిజం సంస్థ గుర్తించే స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇక నగర వ్యాప్తంగా ఉన్న 3,500 చెరువులు, కుంటలు బ్యూటిఫికేషన్‌తో విహార కేంద్రాలను తలపిస్తున్నాయి. 

హైద‌రాబాద్‌లో ప‌ర్యావ‌ర‌ణం భేష్‌

దేశంలో ఉన్న మెట్రో నగరాలన్నీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ గడిచిన మూడేళ్లలో హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వాతావరణంలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న వాహన రాకపోకలకు ధీటుగా పచ్చదనం పరుచుకోవడంతో కాలుష్య తీవ్రత తగ్గిపోతుంది. శిలాజ ఇంధ‌నాల వినియోగం తగ్గింపు, జీరో ఎమిషన్‌, పరిశ్రమలకు నిలయంగా ఉన్న జీరో డిశ్చార్జ్‌ వంటి వినూత్న కార్యకలాపాలతో పారిశ్రామిక కాలుష్య తీవ్రతను తగ్గించేలా కృషి చేస్తోంది. కోర్‌ సిటీలో ఉన్న పరిశ్రమలను అవుటర్‌ దాటించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రేటర్‌ నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతోంది.

ఓఆర్‌ఆర్‌ వెంట ప‌చ్చ‌ల‌హారం

హైదరాబాద్‌ నగరానికి బంగారు వడ్డాణంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అవుటర్‌ రింగు రోడ్డు కొత్తందాలకు నిలయంగా మారింది. 650 లక్షల మొక్కలతో గ్రీన్‌ కారిడార్‌గా మారింది. దాదాపు 881 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్‌, 56 లక్షల మొక్కలతో కాలనీ ప్లాంటేషన్‌, కోటిన్నరకు పైగా ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌కు తోడు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఓఆర్‌ఆర్‌ వెంట చేపట్టిన బ్లాక్‌ ప్లాంటేషన్‌తో పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. 1087 అర్బన్‌ పార్కులు, 600 నర్సరీలు, 57 థీమ్‌ పార్కులు, 12.5 హెక్టార్ల ల్యాండ్‌ స్కేప్‌ గార్డెనింగ్‌, జపాన్‌ టెక్నాలజీ మియావాకీ అడవుల పెంపకంతో పదేళ్లలో రికార్డు స్థాయిలో గ్రీనరీ నిండిపోయింది. 2011లో 33.15 చ. కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రీన్‌ కవర్‌ 2021 నాటికి ఏకంగా 81.81చ. కిలోమీటర్లకు వృద్ధి చెందింది. దీంతో రెండుసార్లు గ్రీన్‌ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు ఎకో ఫ్రెండ్లీ సిటీగా నిలిచింది.

మ‌రో కోటి మొక్క‌లు నాటేందుకు జీహెచ్ఎంసీ సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపడుతున్నది. ప్రత్యేక కార్యాచరణతో పర్యావరణహితంగా, పచ్చని నగరంగా హైదరాబాద్‌ ప్రపంచంలోనే ప్రాముఖ్యతను తీసుకువచ్చిన అధికారులు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పచ్చదనం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొమ్మిదో విడత హరితహారం కింద కోటి మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీల్లో కోటి మొక్కలు సిద్ధం చేశారు. ఎల్భీనగర్‌ , కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్‌లో ఒక్కో జోన్‌కు 20 లక్షలు, చార్మినార్‌, సికింద్రాబాద్‌లో ఒక్కో జోన్‌కు 14 లక్షలు, ఖైరతాబాద్‌ జోన్‌లో 12 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌ విధించింది. డిసెంబర్‌ నెలాఖరు నాటికల్లా ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇన్‌స్టిట్యూషన్స్‌, ఖాళీ స్ధలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు.