mt_logo

ద‌ళిత బంధు ల‌బ్ధిదారుడికి దళిత ర‌క్ష‌ణ నిధితో ద‌న్ను.. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచ‌న‌

  • 76 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు
  • నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ఖాతాలు

ద‌ళిత‌వాడ‌ల్లో ద‌రిద్రాన్ని పార‌దోలి..ద‌ళిత బిడ్డ‌లంద‌రూ సొంత కాళ్ల‌పై నిల‌బడేలా చేయాల‌నే గొప్ప సంక‌ల్పంతో సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందేలా ప‌థ‌కాన్ని డిజైన్ చేశారు. ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులను విడుదలజేయడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, ల‌బ్ధిదారుల‌కు ఏదైనా అనుకోని న‌ష్టంవాటిల్లితే ఎలా? మ‌ళ్లీ వాళ్ల ప‌రిస్థితి మొద‌టికొస్తుంది. అలాకాకుండా ఏ న‌ష్టం జ‌రిగినా మ‌ళ్లీ ద‌ళిత బంధు సాయం అందేలా సీఎం కేసీఆర్ ఓ గొప్ప ఆలోచ‌న చేశారు. అదే ద‌ళిత ర‌క్ష‌ణ నిధి.. తాజాగా, దాన్ని ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చిన నిజ‌మైన ద‌ళిత బంధువుగా సీఎం కేసీఆర్ కీర్తిగ‌డించారు.

76 కోట్లతో ‘దళిత రక్షణ నిధి

దళితబంధు లబ్ధిదారుల సహాయార్థం రాష్ట్ర సర్కారు రూ.76 కోట్లతో ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలవారీగా బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో ఆ మొత్తాన్ని జమ చేసింది. దళితజాతి సాధికారతకోసం సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న తరహాలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నిరుపేద దళితులు తమకు నచ్చిన, వచ్చిన పనిని సొంతంగా చేసుకొనేందుకు ఎలాంటి షరతులు, బ్యాంకు లింకేజీలు లేకుండా ప్రభుత్వమే ఏక మొత్తంగా రూ.10 లక్షలను అందిస్తున్న సంగతి విదితమే. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 38,323 మందికి రూ. 10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయగా, లబ్ధిదారులు యూనిట్లను కూడా ఏర్పాటు చేసుకొన్నారు.

‘దళిత రక్షణ నిధి* ఎందుకంటే?

-దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకొన్న యూనిట్‌కు ఊహించని రీతిలో నష్టం వాటిల్లిన సందర్భంలో.. సదరు లబ్ధిదారుడికి పరిహారం అందించి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే దళితబంధు పథకం ప్రారంభంలోనే దళిత రక్షణ నిధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపకల్పన చేశారు.
-లబ్ధిదారుడికి అందజేస్తున్న రూ.10 లక్షల నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ వాటాగా రూ.10 వేలను కలిపి నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
-అందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల నుంచి రూ.10 వేల చొప్పున రూ.38.32 కోట్లను రక్షణ నిధికి కేటాయించారు.
-నియోజకవర్గాలవారీగా ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తీసి ఈ నిధులను ఆయా అకౌంట్లలో జమ చేశారు.
-ప్రభుత్వం ఇటీవలే తన వాటా 38.32 కోట్లను విడుదల చేయగా, ఆ మొత్తాన్ని కూడా నియోజకవర్గాల వారీగా అకౌంట్లలో జమ చేశారు. మొత్తంగా రూ.76.64 కోట్లకు పైగా నిధులతో దళితబంధు రక్షణ నిధి ఏర్పాటయ్యింది.

కలెక్టర్ బాధ్యుడిగా కార్య‌క్ర‌మం

దళిత రక్షణ నిధికి కలెక్టర్‌ బాధ్యులుగా కొనసాగనున్నారు. దళితబంధు లబ్ధిదారుడు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల నష్టపోయినప్పుడు తిరిగి అతనికి ఆర్థిక చేయూతనందివ్వడమే దళిత రక్షణ నిధి ముఖ్య ఉద్దేశం. అయితే అందుకు సంబంధించి నష్టపోయిన లబ్ధిదారుడు కలెక్టర్‌కుగానీ, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఈడీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జరిగిన నష్టాన్ని వివరించాల్సి ఉంటుంది. దానిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నివేదికను రూపొందిస్తారు. దీన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి పొందిన అనంతరం సదరు దళితబంధు లబ్ధిదారుడికి దళితరక్షణ నిధి నుంచి తిరిగి పరిహారం అందించేలా ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు రూపొందించింది.