రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, రైతు భరోసాను అమలు చేయాలి, రైతు ఋణమాఫీ చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మరియు ప్రజాప్రతినిధుల బృందం వినతిపత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరెంట్, నీళ్లు ఇవ్వకపోవడం కాంగ్రెస్ వైఫల్యం. వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు అని అన్నారు
24 గంటల్లో కూడవెల్లి వాగులోకి నీళ్లు ఇవ్వకుంటే, మల్లన్న సాగర్ ముట్టడి చేస్తాం.. మేమే గేట్లు ఎత్తుతాం అని హెచ్చరించారు. తక్షణం కాలువలు, చెరువుల కింద ఉన్న పంటలకు నీటిని విడుదల చేయాలి.. ఇంకా 2-3 తడులకు నీళ్లు అందిస్తే రైతులకు ఉపయోగం అని హరీష్ పేర్కొన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి.. త్రీ ఫేజ్ ఉండేలా చూడాలి.. పంటలు ఎండిపోయాయి.. ఎండిన పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్ చేయించి రైతులకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఈ యాసంగికి నీటి సమస్యతో దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.. రైతులందరికీ మీరు హామి ఇచ్చినట్టే ప్రతి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి రైతులు తీసుకువచ్చే ప్రతీ గింజను కొనుగోలు చేయాలి అని తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ తక్షణం చేయాలి.. రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి.. మీరు చెప్పినట్టు రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు రైతులకు ఇవ్వాలి అని హరీష్ అన్నారు
వడగళ్ళ వర్షం ద్వారా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి.. వారిని ఆదుకోవాలి అని కోరారు.