mt_logo

ఆరు నెలల కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన హరీష్ రావు

గ్రూప్స్ ఉద్యోగాలు, నీట్ పరీక్ష, పెండింగ్ జీతాలు, పింఛన్లపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించమని వేడుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందంటున్నారు. ప్రజా దర్బార్‌కు వెళ్లి కాళ్లమీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరామ్ దగ్గరికి వెళ్లినా స్పందన లేదు. కొత్త హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలన అమలు చేయమని కోరుకుంటున్నారు అని తెలిపారు.

కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరఫున ఐదు డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి అని అన్నారు.

పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు అని హరీష్ అడిగారు.

25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు.

4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి 6 నెలలు దాటినా అమలు చేయడం లేదు. మే నెల పింఛన్ ఇంకా ఇవ్వలేదు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్ కూడా ఎందుకివ్వడం లేదు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలు చేయడం లేదు. పేదల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం?
పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి అని హితవు పలికారు.

ఒక్కొక్కరికి 12 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఈనెలకు కలిపి మొత్తం 16 వేలు ఇవ్వాలి. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 4 వేల పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీ మాట ప్రకారం 6 వేలు ఇవ్వండి. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 28 లక్షల పింఛన్లు ఉంటే దిగిపోయేనాటికి 44 లక్షల పింఛన్లు ఉన్నాయి. ప్రతి ఏటా 12 వేల కోట్లు పింఛన్లు కేటాయించాం. పెండింగ్ ఫింఛన్ చెల్లించి కొత్త పింఛన్లు మంజూరు చేయాలి అని కోరారు.

ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇవ్వడం లేదని ఆశావర్కర్లు, ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18వ తేదీన జీతాలిస్తున్నారు. 1వ తేదీనే జీతాలిస్తే హైదరాబాద్ వచ్చి ఎందుకు దర్నా చేస్తారు? గ్రామ పంచాయతీ పారిశుధ్య వర్కర్లకు 5 నెలలుగా జీతాలు అందడం లేదు. తమ సొంత ఖర్చులతో డీజిల్ పోయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సఫాయి కార్మికులకంటే పేదలింకెవరు ఉంటారు అని అన్నారు.

సీఎంఆర్ఎఫ్‌కు సంబంధించి 65 వేల చెక్కులు ప్రింట్ అయి పంపిణీకి రెడీగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మ ఉందనే కారణంతో ఆపారు.. మీ ఫొటో పెట్టి ఇవ్వండి. అంగన్వాడీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు రావడంలేదు. వాళ్లకు వేరే పనులు చెప్పి వేధిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు దేశంలో ఎక్కువ జీతాలు కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వస్తున్న జీతం కూడా ఇవ్వడం లేదు అని విమర్శించారు.

నీట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ హయాంలో సంపద కొందరి చేతుల్లోకి వెళ్లినట్టే విద్య కూడా కొందరి చేతుల్లో వెళ్తోంది. 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. రెండేళ్లు నిద్రాహారాలు మాని చదువుకున్నారు. గ్రేస్ మార్కులు, పేపర్ లేకేజీ ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుంది? ఒకే సెంటర్లో రాసిన ఆరుగురికి 720 మార్కులెలా వచ్చాయి? అని హరీష్ ప్రశ్నించారు.

గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది పేర్లు, క్రైటీరియా బయటపెట్టాలి. నీట్‌లో గ్రేస్ మార్కుల విధానమే లేనప్పుడు ఎలా కలిపారు? ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి, పార్లమెంటు ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారు? ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదు? పేపర్ లీక్ కాకపోతే బిహార్, గుజరాత్‌లో ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి? అని అడిగారు.

తెలుగు విద్యార్థులకు అన్యాయం జరక్కుండా బీజేపీ ఎంపీలు, మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి. ఇంత ప్రధాన సమస్యమై మీరెందుకు మాట్లాడ్డం లేదు? మెడికల్ ఎడ్యుకేషన్ చాలా కీలకం. పేదలకు వైద్యవిద్య అందాలని మేం జిల్లాకొక మెడికల్ కాలేజీ పెట్టాం. మీరు పేపర్లు లీక్ చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారు. నీట్ అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సంచలనాల కోసం నాపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్‌లో ఏవో ప్రచారం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అయ్యానని, కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏవేవో చెబుతున్నారు. దయచేసి ఇలాంటి తంబ్ నెయిల్స్ పెట్టండి. మీ లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయకండి. ఇలాంటివి మానుకోకపోతే లీగల్ చర్యలు తీసుకోడానికి వెనుకాడబోం అని హెచ్చరించారు.