mt_logo

జీవో 33పై పోరాటం చేస్తాం: బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు హరీష్ రావు హామీ

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జోవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు కలిశారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధగా ఉందన్న తల్లిదండ్రులు.. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని వారు హరీష్ రావును కోరారు.. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన హరీష్ రావు, తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జీవో 33 పై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేసిన హరీష్ రావు.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు.. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.