mt_logo

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది: హరీష్ రావు

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేం నిద్రపొమని.. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారు.. అప్పుడు కూడా కుట్రలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. కానీ కుట్రలు ఫలించలేదు.. న్యాయం గెలిచింది.. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారు అని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనన్నవాళ్లు తర్వాత కనిపించకుండాపోయారు. పార్టీకి కష్టాలు వస్తాయి.. మీరు ధైర్యంగా ఉండండి.. మీ బాధ్యత నేను తీసుకుంటా.. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు.. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారు.. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు.. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం.. రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం.. నిధులు వరద పారించాం. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం. మహిపాల్‌ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చింది? ఇది న్యాయామా? నీకిది తగునా? వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ అని దుయ్యబట్టారు.

కార్యకర్తలకు ధైర్యం చెప్పుదాం అని వచ్చిన నాకే మీరు వేలాది మందిగా తరలివచ్చి ధైర్యం చెప్పారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందాం.. మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారు.. కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారు అని పేర్కొన్నారు.

పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడు.. జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారు.. వ్యతిరేకత వస్తోందని మాట మార్చుతున్నారు.. పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటతో చెప్తున్నావు.. అదే నిజమైతే జీవో మార్చు. వడ్లకు బోనస్ అని తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టావు అని హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారు. పీఎం కిసాన్ నిబంధనలు ఎందుకు.. రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు అని అడిగారు.

ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. మీరు ధైర్యంగా ఉండండి, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పనిచేసి గెలుద్దాం. కాంగ్రెస్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదేళ్లకు మించి అధికారంలో లేదు ఆని వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీల్లో ఒక్కటి సరిగ్గా అమలు కాలేదు. బస్సు తప్ప అంతా తుస్సే.. ఆ బస్సులోనూ లొల్లులే. ప్రజలు కాంగ్రెస్ లీడర్లను వదిలిపెట్టరు.. పరిపాలన స్తంభించింది.. జీతాలు అందడం లేదు.. పాలేంటే నీళ్లేంటో తెలిసిపోతుంది. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు.. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారు.. ఇక్కడ ఎగిరేది మళ్లీ మన జెండానే అని హరీష్ అన్నారు.

పదేళ్ల పాలనలో మనం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాం.. కొన్ని విషయాలు విస్మరించాం. కార్యకర్తలపై, నాయకత్వంపై దృష్టిపెడతాం.. మన మంచితనాన్ని ప్రజలు గుర్తిస్తారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి.. దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలి.. పార్టీ మీకు అండగా ఉంటుంది ఆని భరోసానిచ్చారు.