ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చి.. మాట తప్పిందని.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి అని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్‌లో చర్చించి, వెంటనే ప్రకటించాలి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఆనాటికి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పింఛనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి, బకాయిలను నేరుగా ఉద్యోగస్థులకు నేరుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంసీహెచ్ఆర్డీలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై మరుసటి రోజే క్యాబినెట్‌లో చర్చించి డీఏలు వెనువెంటనే విడుదల చేస్తామని మరోసారి హామి ఇచ్చి మాట తప్పారు అని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఈనాటికి 5 డీఏలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ప్రభుత్వం బకాయి పడింది. డీఏలు విడుదల చేయకపోవడం వల్ల ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది అని తెలిపారు.
బకాయిపడ్డ 5 డీఏల మొత్తం 17.29 శాతం గురించి ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.. అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సప్లిమెంటరీ బిల్లులను 15 పనిదినాల్లో చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ జీపీఎఫ్, సరెండర్ లీవ్ తదితర సప్లిమెంటరీ బిల్స్ నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం, వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీనిపై కూడా ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ ఏడాది మార్చి 31 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 5 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. వారికి రావాల్సిన జీపీఎఫ్, ఐఎల్ ఎన్‌క్యాష్మెంట్, గ్రాట్యుయిటీ, ఇన్స్యూరెన్స్, కమ్యూటెడ్ బకాయిల కోసం సచివాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరగలేకపోతున్నారు అని ఆక్షేపించారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే బకాయిలను విడుదల చేయాలని హరీష్ డిమాండ్ చేశారు.
🔸ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.