mt_logo

నీది కాంగ్రెస్ స్కూల్.. టీడీపీ అని చెప్పుకునే హక్కు లేదు!

బుధవారం ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు వైరా రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులంతా మన స్కూలే అని చంద్రబాబు కరీంనగర్ సభలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంతకూ చంద్రబాబుది ఏ స్కూలో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన సమయంలో కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలో చేరి 1983 ఎన్నికల్లో సత్తుపల్లి నుండి తుమ్మల, సిద్దిపేట నుండి కేసీఆర్ పోటీ చేశారని, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ నుండి పోటీ చేశారని, పిల్లనిచ్చిన మామపైనే పోటీ చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు.

చంద్రబాబూ! నీది కాంగ్రెస్ స్కూల్.. టీడీపీ అని చెప్పుకునే హక్కు లేదు. నీకంటే ముందే తుమ్మల, కేసీఆర్ ఆ పార్టీలో ఉన్నారు. అంతేకాదు, తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవన్నారు. ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు ప్రకటించిందని, డిపాజిట్ కోల్పోతామని టీడీపీ భయపడి బీజేపీకి మద్దతు తెలిపినా బీజేపీకి కూడా డిపాజిట్ గల్లంతయ్యిందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీకే మద్దతు ఇస్తున్నదని, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని హరీష్ ఎద్దేవా చేశారు.

కరీంనగర్ లో బాబు పర్యటించిన రోజే ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో ఏపీ అధికారులు సమావేశమయ్యారని, తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఇస్తానని ఇక్కడ బాబు చెప్తుండగానే, అక్కడ ఢిల్లీలో ఏపీ విద్యుత్ అధికారులు కృష్ణపట్నం నుండి తెలంగాణకు విద్యుత్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని హరీష్ రావు మండిపడ్డారు. ఒక సీఎం ఆదేశాలు లేకుండానే అధికారులు అట్లా చెప్తారా? అసలు నీకు ఎన్ని నాల్కలు? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే వైఖరి అంటే ఇదే. విభజన చట్టం ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు రావలసిన వాటా దక్కించుకుంటాం అని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఉన్న రైతులకు ఆంధ్రాలో వ్యవసాయం ఉంటే అక్కడ రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టాడని, ఆ రైతులకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే రుణమాఫీ చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణలో అప్పుడప్పుడూ పర్యటిస్తూ ఆంధ్రాలో ఏదో ఉన్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడని, తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు కూడా సీఎం కేసీఆర్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ఇస్తున్నారని, తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఇక్కడి వాళ్ళేనని ఆదరిస్తున్నారని హరీష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *