mt_logo

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య: హరీష్ రావు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని మండిపడ్డారు.

మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్‌లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.

దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి అని కోరారు.