రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా పరిహారం అవ్వాలని వేడుకుంటూ.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు ధర్నా చేస్తున్నాం. బాల్కొండలో పోలీసులు ధర్నాలో పాల్గొనవద్దు అని ప్రజలకు నోటీసులు ఇచ్చారు అని దుయ్యబట్టారు.
కొండారెడ్డిపల్లిలో సరితా, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల మీద దాడి చేయడం దారుణం. అదిలాబాద్‌లో మొన్న రైతులను అరెస్టులు చేశారు. ప్రజారాజ్యంలో అణిచివేతలేనా, రైతులు బాధలు చెప్పుకునే హక్కు కూడా ప్రజలకు లేదా.. ఈ దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.
రుణమాఫీ అని రణం చేస్తున్నారు.. ఎద్దు ఏడ్చిన ఏవుడం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రుణమాఫీ వంద శాతం చేసేదాకా నీ వెంట పడతాం. పోలీసులు చట్టానికి బద్ధులై పని చేయాలి అని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫి చేస్తానన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారు.. పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్టు వేసిండు.. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి మీద కూడా ఒట్టు వేశారు కానీ మాట తప్పారు.. పాలకులే పాపం చేస్తే ఎలా అని అడిగారు.
ప్రజలకు ఆ పాపం జరగవద్దని దివాలా కోరు సీఎంను క్షమించాలని, ప్రజలకు మంచి జరగాలని వేడుకున్నాం. పంద్రాగస్టు అయిపోయింది కానీ రుణమాఫీ కాలేదు. రైతు ద్రోహం కాదు దైవ ద్రోహానికి రేవంత్ పాల్పడ్డాడు అని హరీష్ మండిపడ్డారు.
నన్ను రాజీనామా చెయ్యి అన్నాడు.. నేను అలా అనను.. ప్రజలకు మంచి చేయడమే నాకు తెలుసు. పార్టీలు మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది.. ఓడిపోతే సన్యాసం అని మాట తప్పింది రేవంత్ అని విమర్శించారు.
17 లక్షల రైతులకు రుణమాఫీ చేసేది ఉంది అని ఉత్తమ్ అంటారు.. పొంగులేటి రూ. 12 వేల కోట్లు అన్నారు.. తుమ్మల గారు రూ. 17 వేల కోట్లు మాత్రమే చేశాం.. మొత్తం రూ.31 వేల కోట్లు చేసేది ఉందన్నారు. అయ్యింది తక్కువ కానిది ఎక్కువ.. ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పిన మాట. ఇంకా 56% రుణమాఫీ బాకీ ఉంది అని పేర్కొన్నారు.
ఎవరు రాజీనామా చెయ్యాలి.. నీతి నిజాయితి ఉంటే రేవంత్ బహిరంగంగా క్షమాపణ చెప్పి.. దేవుడా నన్ను క్షమించు అని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.. రేవంత్ చేసుకోడు కాబట్టి మేము దేవుడి వద్దకు వచ్చాం అని తెలిపారు.
ఈ దగాకోరు ముఖ్యమంత్రిని క్షమించు అని వేడుకున్నాం.. తెలంగాణ ప్రజలను దీవించు అని వేడుకున్నాము. రుణమాఫీ అందరికీ వచ్చేలా, రైతుబంధు ఇచ్చేలా పోరాటం చేసేందుకు మాకు బలం ఇవ్వు అని దేవుణ్ణి వేడుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ వచ్చేలా పోరాటం చేస్తం అని స్పష్టం చేశారు.
ఎంతమందికి రుణం ఉన్నది.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీ అయితే రైతులు ఎందుకు రోడ్లమీదకు వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు. ఆగష్టు దాటుతున్నది.. రైతుబంధు ఎప్పుడు ఇస్తావ్.. అది ఇచ్చేలా పోరాటం చేస్తాం అని అన్నారు.
రేవంత్ ఇస్తానన్న రూ. రెండు లక్షల రుణమాఫీ చెయ్యి.. మీద ఉన్నది కట్టుమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నావ్ అని సీఎంని ప్రశ్నించారు. స్పీకర్, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావ్ రుణమాఫీ కానీ ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు. డిసెంబర్ 7 వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తాం అంటే ఎలా.. నువ్వు చేసింది పూర్తి మాఫీ కాదు పాక్షిక మాఫీ.. డిసెంబర్ 9 నాడు నువు మాఫీ చేస్తే ఆ వడ్డీ రైతుల మీద పడేది కాదు. యాదాద్రి నుండి యాత్ర ప్రారంభించాం.. ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో అన్ని చోట్లకు వెళ్తాం అని హరీష్ రావు తెలిపారు