mt_logo

కాంగ్రెస్ ఎలక్షన్ కోడ్ రాజకీయాలు, బీజేపీ ఈడీ రాజకీయాలు చేస్తున్నాయి: హరీష్ రావు

పాపన్నపేటలో జరిగిన మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మన పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం.. విభేదాలు పక్కన పెట్టాలి.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలి అని అన్నారు.

ప్రజల కోసం కష్టపడే మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. మెదక్‌ను జిల్లా కేంద్రం చేసి.. మెదక్‌కు రైలును, మెడికల్ కాలేజీని తెచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ శాంక్షన్ చేసిన వంద కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు తీసుకుంది.. అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు.

ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు.. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేటు ముంచిన్రు. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదు. బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి.. రైతులు కష్టాలపాలయ్యారు అని పేర్కొన్నారు.

కోతలరాయుడు రేవంత్ వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి రూ. 2500కు కొంటానన్నాడు.. యాసంగి వడ్లకన్నా ఇవ్వాలి కదా.. వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే రాజకీయ వలసలపై దృష్టి పెట్టిండు. వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో చురుకు పెట్టాలి అని కోరారు.

ఎన్నికల ముందు రైతుబంధు పడుతుందని నేను చెప్తే కాంగ్రెస్ ఈసీ దగ్గరికి వెళ్లి ఆపించింది.. ఆ పైసలు పోయాయి. రైతుబంధు కింద పెంచుతామని చెప్పిన రూ. 15 వేలు రాలేదు.. కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా మోసం చేశారు. కేసీఆర్‌కు రైతు అంటే మొదలు, రేవంత్‌కు రైతులంటే చివర అని హరీష్ దుయ్యబట్టారు.

కేసీఆర్ హయాంలో రైతులకు సమస్యలే లేవు.. కరెంటు, నీళ్లు పుష్కలం . మెదక్ సస్యశ్యామలంగా మారింది. కానీ ఇప్పుడు కరెంటు పోతోంది. ఈ సభలో కరెంట్ పోవడం దీనికి నిదర్శనం.. నాలుగు నెలల కాలంలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు.. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. పంటకు నిప్పు పెడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు.. కనీసం పరామర్శించడం లేదు అని విమర్శించారు.

రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిన రేవంత్ 42 లక్షల మంది అవ్వాతాతలను మోసం చేసింది..కేసీఆర్ మాట మీద నిలిచి పింఛన్ మొత్తాన్ని రూ. 2 వేలకు పెంచిండు.. కాంగ్రెస్ ఆ పింఛన్ కూడా ఎగ్గొట్టింది.. అన్నవస్త్రం కోసం ఆశపడితే ఉన్నవస్త్రం పోయిందట.. మాట తప్పిన కాంగ్రెస్‌కు అవ్వాతాతలు గట్టిగా బుద్ధి చెప్పాలి.. కడుపులో పెట్టుకున్న కేసీఆర్‌ను సాదుకోవాలి అని అన్నారు.

హామీలపై అసెంబ్లీలో మేం ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, మెడలు వంచాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలి.. ప్రశ్నించే గొంతును గెలిపించాలి.. పార్లమెంటు ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల్లో కారునే గెలిపించాలి అని పిలుపునిచ్చారు.

రేవంత్ ఆడవాళ్లకు నెలకు రూ. 2,500 ఇస్తామని మోసం చేసిండు.. అక్కచెల్లెళ్లు కారు మీద ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనాలి. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ హామీనీ ఎగ్గొట్టిండు.. వచ్చే లక్ష కూడా రావడం లేదు.. నిరుద్యోగులకు రూ. 4 వేలు ఇస్తామని చెప్పిండు రేవంత్.. కానీ అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం నిండు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిండు.. ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీని కూడా ఇవ్వలేదు. ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ఓటు వేస్తే గొర్రె కసాయివాడిని నమ్మినట్టే అని తెలిపారు.

బీజేపీ కూడా ఓట్ల కోసం వస్తోంది.. రఘునందన్ రైతులకు ఎడ్లు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని దుబ్బాక ప్రజలను మోసం చేసి గెలిచిండు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు ఎంపీగా గెలిపించాలని వస్తుండు.. హామీలు నిలబెట్టుకోని రఘునందన్‌కు ఓట్లేస్తారా? అని హరీష్ అడిగారు.

పదేళ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తోంది.. కేసీఆర్ యాదాద్రి గుడిని అద్భుతంగా కట్టలేదా? ప్రజలకు ఏం చేశారో బీజేపీ చెప్పాలి అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎలక్షన్ కోడ్ రాజకీయాలు, బీజేపీ ఈడీ రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీకి నచ్చితే జోడీ, కాదంటే ఈడీ. వెంకట్రామిరెడ్డి ఉన్నత విద్యావంతుడు. ఇక్కడ పదకొండేళ్లు కలెక్టర్‌గా పనిచేసిండు. ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. ఆయనకు ధనంతోపాటు మంచి గుణం కూడా ఉన్నది. పేద పిల్లలకు ఫీజుల కట్టి ఉన్నత చదువులు చదివిస్తుండు.. ఆయన గెలుపు కోసం కార్యకర్తలు కష్టించి పనిచేయాలి.. ఫేక్ వార్తలను నమ్మకండి అని సూచించారు.

కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను కాపాడుకోవాలి.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.