కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కి మద్దతుగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కంపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నిక. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు.. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి అని కోరారు.
ఆరు గ్యారంటీల్లో ఒకటే అమలు చేసి.. ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారు. అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది.. చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది.. కాంగ్రెస్ బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి.. కాంగ్రెస్‌కు శిక్ష పడాలి అని అన్నారు.
రేవంత్ ఇప్పుడు సిగ్గులేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి.. మంచినీళ్లు వస్తలేవు.. పింఛన్లు వస్తలేవు.. కేసీఆర్ తెచ్చినవన్ని తీసేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక అన్ని గోవిందా గోవిందా పాటలా మారాయి.. దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి పింఛను అన్ని గోవిందా.. మహాలక్ష్మి గ్యారంటీ మహా మోసం అని విమర్శించారు.
మీరు వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తాం. వినోదన్న అభివృద్ధి సాధకుడు.. బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేశాడు? బీజేపీ పదేళ్ల పాలనలో పప్పు, ఉప్పు ధరలు పెరిగాయి అని హరీష్ దుయ్యబట్టారు.
కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష.. సాగునీళ్లు, మెడికల్ కాలేజీలు, నిరంతర కరెంటు, కేసీఆర్ కిట్టు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కాంగ్రెస్ అడ్డుకున్నా పట్టుబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం.. కాంగ్రెస్ వచ్చాక అంతా రివర్స్ అయింది.. కరెంటు మీటర్లు కాలిపోతున్నాయి.. రిపేరుకు పది వేలు ఖర్చవుతోంది అని అన్నారు.
గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చుండు.. రేవంత్ చేసిందేమీ లేదు. గుంపు మేస్త్రీకి మాటలెక్కువ, చేతులు తక్కువ.. గుంపు మేస్త్రీ గూబ పలకాలంటే కారు గుర్తుకు ఓటు వెయ్యాలి. ఎవరు మనకు మేలు చేశారో వాళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. ముసలోళ్లు కేసీఆర్ ఇచ్చిన కంటివెలుగు కళ్లద్దాలు పెట్టుకుని మూడో నంబరు బటన్ నొక్కాలి అని పిలుపునిచ్చారు.